Tejashwi Yadav Comments In Bihar Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల వేళ.. తేజస్వీ కీలక ప్రకటన
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:33 PM
బిహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అలాంటి వేళ.. ఇండి కూటమిలో భాగస్యామ్య పక్షం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గురువారం పాట్నాలో కీలక ప్రకటన చేశారు.
పట్నా, అక్టోబర్ 09: బిహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అధికారం కోసం ప్రజలపై రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. అలాంటి వేళ.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాష్ట్ర ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చిన ఇండి కూటమి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన 20 రోజుల్లోనే అందుకు సంబంధించిన చట్టం తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం బిహార్ రాజధాని పాట్నాలో తేజస్వీ యాదవ్ వెల్లడించారు.
బిహార్‌లో జాబ్ లేకుండా ఏ ఇల్లు ఉండడానికి వీల్లేదన్నారు. ఈ రోజు తాను చేసింది.. చారిత్రాత్మక ప్రకటనగా ఆయన అభివర్ణించారు. బిహార్‌ను ప్రగతి పథంలో ఎలా తీసుకు వెళ్లాలంటూ అంతా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకో లేదని కాస్తా ఘాటుగా విమర్శించారు. ఇంకా చెప్పాలంటే.. గత 20 ఏళ్లుగా నిరుద్యోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. దీంతో ఈ సమస్య అతిపెద్దదిగా మారిందన్నారు.
అయితే ఏన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీయూ కానీ.. బీజేపీ కానీ ఉద్యోగాలపై ప్రజలకు హామీలు ఇవ్వడం లేదని చెప్పారు. కానీ నిరుద్యోగ భృతిపై మాత్రం ఆ యా పార్టీలు హామీలు ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబాలకు.. ఈ కొత్త చట్టం ద్వారా అవకాశం లభిస్తుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల్లోనే.. ప్రభుత్వ ఉద్యోగం లేని ఇల్లు బిహార్‌లోనే ఉండదని తెలిపారు. ఇది తన ప్రతిజ్ఞగా తేజస్వీ యాదవ్ అభివర్ణించారు. అదీకాక బిహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఆ క్రమంలో సామాజిక న్యాయంతోపాటు బిహార్ ప్రజలకు ఆర్థిక న్యాయం కూడా అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇస్తున్నామన్నారు.
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు దశల్లో.. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు, ఇండి కూటమిలోని పార్టీలతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురజ్ బరిలో దిగనుంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి బిహార్ ఓటర్లు పట్టం కట్టారనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 14వ తేదీన తేలనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..
రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి