MLA Buchchaiah Chowdary: జగన్ కేసులు తుది దశకు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:54 PM
జగన్‌పై ఉన్న అవినీతి కేసులు, ఈడీ కేసులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల్లో ఇంకెన్నేళ్లు జైల్లో మగ్గాల్సి ఉంటుందో..? అని అనుమానం వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి కేసుల్లో 16 నెలలు జైలుకెళ్లి బయటకొచ్చిన జగన్ పుష్కరోత్సవం జరుపుకుంటున్నారని విమర్శించారు. జగన్ రాజకీయ జీవితం చరమాంకంలో ఉందని ఆరోపించారు. జగన్ రాష్ట్రమంతా.. అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌పై ఉన్న అవినీతి కేసులు, ఈడీ కేసులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల్లో ఇంకెన్నేళ్లు జైల్లో మగ్గాల్సి ఉంటుందో..? అని అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా అసభ్య పదజాలం మరింత విస్తృతం చేయాలని తాడేపల్లి ప్యాలెస్‌లో బూతోత్సవం పెట్టారని మండిపడ్డారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టటం జగన్ అవివేకమని ఎద్దేవా చేశారు.
ఒక్క అవకాశం అని మాజీ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలు మళ్లీ మళ్లీ మోసపోయేంత అమాయకులు కాదని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలకులు పనికట్టుకొని కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేస్తుంటే.. ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల మాటలు నమ్మడం ప్రజలు ఎప్పుడో ఆపేసారని.. అది వైసీపీ నేతలు గ్రహించాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
కమిషనర్ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు