RV Karnan: కమిషనర్ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:02 AM
‘ఎంత చెప్పినా మీరు మారరా..? ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల విషయంలో ఇంత నిర్లక్ష్యమా..? టెండర్లు పూర్తయిన పనులూ ప్రారంభం కాలేదు. చెరువుల అభివృద్ధి, నాలాల విస్తరణ పనుల్లోనూ పురోగతి లేదు. పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు.
- ఇంజనీర్లకు కమిషనర్ హెచ్చరిక
హైదరాబాద్ సిటీ: ‘ఎంత చెప్పినా మీరు మారరా..? ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల విషయంలో ఇంత నిర్లక్ష్యమా..? టెండర్లు పూర్తయిన పనులూ ప్రారంభం కాలేదు. చెరువుల అభివృద్ధి, నాలాల విస్తరణ పనుల్లోనూ పురోగతి లేదు. పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు. ఇదే ఆఖరు హెచ్చరిక’ అని ఇంజనీరింగ్ అధికారులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) మండిపడ్డారు. మంగళవారం కేబీఆర్ పార్కు(KBR Park) చుట్టూ వంతెనల నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
సాయంత్రం కేంద్ర కార్యాలయంలో ఇంజనీరింగ్, భూసేకరణ విభాగం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ కార్యక్రమాల కింద చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని, క్షేత్రస్థాయిలో సవాళ్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చెరువుల అభివృద్ధికి 83 పనులు చేపట్టగా.. 25 మాత్రమే ప్రారంభం కావడం, మొదలైన పనులూ నత్తనడకన జరుగుతుండడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ఇంజనీర్లు సరిగా పనిచేయడం లేదని, వారం రోజుల్లో పనులపై జోనల్ కమిషనర్ల ద్వారా క్షేత్రస్థాయి నివేదిక తీసుకుంటామని, పురోగతి కనిపించకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు పనులు వేగంగా జరిగేలా చూడాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీలోగా ఫలక్‌నుమా ఆర్‌ఓబీని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లలో వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణం త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Read Latest Telangana News and National News