AP Bus Accident: అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Dec 12 , 2025 | 10:07 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Seetharama Raju District) చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో ఇవాళ(శుక్రవారం) తెల్లవారు జామున బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను అధికారులు వెల్లడించారు.
మృతుల వివరాలివే..
శ్రీ కళా
సునందా
శివశంకర్ రెడ్డి
ఉమారెడ్డి
కృష్ణ కుమారి
రఘరా మధు
పొంగుల ప్రసాద్
ఇంకా 2 మృతదేహాలు గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
అల్లూరి జిల్లా ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఇస్తున్నామని తెలిపారు. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నానని వివరించారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ప్రధాని మోదీ.
బస్సు ప్రమాదంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు లోయలోపడి ప్రయాణికులు దుర్మరణం చెందడం బాధాకరమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నానని తెలిపారు పవన్ కల్యాణ్.
యాత్రికుల మృతి చాలా బాధాకరం: కిషన్‌రెడ్డి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సు.. లోయలో పడి పలువురు యాత్రికులు మృతిచెందడం చాలా బాధాకరమని తెలిపారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి ఆత్మ శాంతించాలని భగవంతుడును ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కిషన్‌రెడ్డి.
యాత్రికులతో కూడిన బస్సు చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా తెలుసుకున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హోంమంత్రి అనిత

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు హోం మంత్రి. ప్రైవేటు బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు హోం మంత్రి అనిత.
బస్సు ప్రమాదంపై మంత్రి డీబీవీ స్వామి విచారం

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సు లోయలో పడి యాత్రికులు మృతిచెందిన వార్త తన మనసును తీవ్రంగా కలిచి వేసిందని తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు డోలా బాల వీరాంజనేయస్వామి.
ఈ వార్తలు కూడా చదవండి..
దువ్వాడ మాధురి శ్రీనివాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ
Read Latest AP News And Telugu News