Ananthapur: వానవాన వొద్దప్పా.. కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:24 PM
ఎడతెరిపి లేని వర్షాలతో అన్నదాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కోతకోసిన పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఖరీఫ్ ఆరంభానికి ముందే బారుబావుల కింద వేరుశనగ సాగుచేశారు. పంట కాలం పూర్తవడంతో వేరుశనగను తొలగించారు.
- తీవ్రంగా నష్టపోతున్న వేరుశనగ రైతులు
- కట్టె, కాయలు నల్లగా మారుతున్నాయని ఆందోళన
కళ్యాణదుర్గం(అనంతపురం): ఎడతెరిపి లేని వర్షాలతో అన్నదాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కోతకోసిన పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఖరీఫ్ ఆరంభానికి ముందే బారుబావుల కింద వేరుశనగ సాగుచేశారు. పంట కాలం పూర్తవడంతో వేరుశనగను తొలగించారు. అయితే వర్షాలు తెరిపిలేకుండా కురుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలా వర్షాలు వస్తే పంట తొలగించకపోతే భూమిలోపల ఉన్న కాయలు మొలకలు వస్తాయి. తొలగిస్తే వేరుశనగ కట్టె, కాయలు నల్లగా మారి బూజు పట్టే ప్రమాదం ఉంది.

ఎటు చూసినా రైతుకు నష్టమే. దీంతో వానదేవుడా కొన్నాళ్లు వానకు రెస్ట్ ఇవ్వవయ్యా స్వామి అని ఆకాశంలోని మబ్బుల వైపు చూసి వేడుకుంటున్నారు. నియోజకవర్గంలో సుమారు 1200 ఎకరాలకు పైబడి వేరుశనగ సాగు చేశారు. ఈ సారి వేరుశనగ క్వింటా ధర రూ. ఆరు వేల నుంచి రూ. ఏడువేల దాకా పలుకుతోంది. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో ఉంది. అయితే గత కొన్ని రోజులుగా జడివాన కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేరుశనగ కట్టె, కాయలు పనికిరాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులే..: రాజప్ప, వేరుశనగ రైతు, కంబదూరు
గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి తొలగించిన వేరుశనగ కట్టెకు తేమశాతం అఽధికం అవుతోంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధిక తేమశాతంతో వేరుశనగ కట్టె అంతా నల్లగా మారిపోయింది. దాంతో పాటు తొలగించిన కట్టెకు మొలకలు వస్తున్నాయి. ఈ తేమశాతం పూర్తిగా పోవాలంటే ఎండ వేడిమి అధికం కావాలి. అప్పటివరకు ఈ కష్టాలు తప్పవు. నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. సుమారు రూ. 1.2 లక్షల దాకా పెట్టుబడి పెట్టా. ఈ అధిక వర్షాలతో నష్టాలు తప్పేలా లేవు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం
మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్
ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు
Read Latest Telangana News and National News