Penchalayya case: సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..!
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:54 PM
సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజానాట్యమండలి రూరల్ డివిజన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు పెంచలయ్య. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించారు.
నెల్లూరు, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో (Penchalayya Case) సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజానాట్యమండలి రూరల్ డివిజన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు పెంచలయ్య. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు (Nellore Rural DSP Srinivasa Rao) కీలక విషయాలు వెల్లడించారు. పెంచలయ్య తన కుమారుడితో కలిసి బైకుపై వెళ్తుండగా పది మంది అటకాయించారని.. వారందరూ మూడు బైకులతో వెంబడించారని తెలిపారు. పాతకక్షలు, గంజాయికి వ్యతిరేకంగా పెంచలయ్య పోరాటం చేశారని గుర్తుచేశారు.
అలాగే ఓ ఆలయ నిర్వాహణపై గొడవలు కూడా ఆయన హత్యకు కారణమని వివరించారు. అరవ కామాక్షమ్మతో పాటు నిందితులపై రౌడీషీట్లు, పాత కేసులు ఉన్నాయని తెలిపారు. ఆ కేసుల్లో వారికి బెయిల్ రద్దు అయ్యేలా చూస్తామని చెప్పుకొచ్చారు. ఓ నిందితుడు జేమ్స్ కత్తితో పోలీసులపై దాడి చేశారని.. ఈ క్రమంలో ఆదినారాయణ అనే పోలీసు కానిస్టేబుల్‌కు తీవ్రగాయమైందని తెలిపారు. త్రుటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పిందని అన్నారు. నిందితుడు నుంచి ప్రాణాలను రక్షించుకునే క్రమంలో సీఐ వేణు మొదట ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారని నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కామాక్షమ్మపై పలు కేసులు..
‘పెంచలయ్య కేసులో వైసీపీ నేత అరవ కామాక్షమ్మ, ఆమె గ్యాంగు ఉన్నారు. వైసీపీలో అరవ కామాక్షమ్మ, ఆమె గ్యాంగ్ సభ్యులు కీలక భూమిక పోషించారు. కామాక్షమ్మపై గతంలో హత్యాయత్నం, గంజాయి, ఇళ్లల్లో, రైల్వేలో దొంగతనాల కేసులు, రౌడీషీట్స్ ఉన్నాయి. వైసీపీ ఎస్సీ సెల్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి సహాకారంతో కామాక్షమ్మ నేరాలకు పాల్పడుతున్నారు. కామాక్షమ్మ యాక్షన్ ప్లాన్‌ను ముఖ్య అనుచరుడు జేమ్స్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కామాక్షమ్మ గ్యాంగ్, వైసీపీ నేత పాలకీర్తి రవి అరాచకాలను గట్టిగా పెంచలయ్య నిలదీశారు. వారి అరాచకాలను నిలదీయడంతో నెల రోజుల వ్యవధిలోనే పెంచలయ్యని దారుణంగా హత్య చేశారు. గంజాయి విక్రయాలు, వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పెంచలయ్య. ఆయన హత్య కేసులో నిందితులుగా వైసీపీ నేతలు కామాక్షమ్మ, రవి, జేమ్స్, మరికొందరు ఉన్నారు’ అని నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
పెంచలయ్య కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
హత్యకు గురైన పెంచలయ్య మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు కోటంరెడ్డి. సీపీఎం పార్టీతో పాటు, తాము పెంచలయ్య కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. గంజాయి మాఫియా, రౌడీలు, భూకబ్జాదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పోలీసుల చర్యలను తాము సమర్థిస్తున్నామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!
Read Latest AP News And Telugu News