Kotamreddy Sridhar Reddy: ఎన్ని వీడియోలైనా పెట్టుకోండి.. భయం మా రక్తంలోనే లేదు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:05 AM
తనపై హత్య కుట్రకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియాల్లో ఎన్ని వీడియోలు పెట్టుకున్నా తనకేం భయంలేదని.. కానీ, ఓ పౌరుడిగా తనకు న్యాయం చేయాలని కోరారు.
నెల్లూరు: మీడియా, సోషల్ మీడియాల్లో తన హత్య కుట్రకు సంబంధించిన ఓ వీడియో సెన్సేషన్ కావడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం ఓ ఛానల్లో ప్రసారమైన వీడియో చూసి మొదట షాక్ కి గురయ్యానని అన్నారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో కొందరు రౌడీషీటర్లు ఈ ఏడాది జులై 1న ఈ సంభాషణ జరిపినట్లు తెలిసిందని.. ఒకరేమో రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బే డబ్బని, మరొకరేమో చంపేద్దామని, ఇంకొకరేమో రేపు మాట్లాడుకుందామని డిస్కషన్లు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. మూడు రోజుల ముందే తన దృష్టిలోకి వచ్చిందని జిల్లా ఎస్పీ చెప్పారని.. కానీ, కనీస జాగ్రత్త చర్యలు తీసుకోమని సూచించలేదని తెలిపారు.
ఎవరికీ భయపడం..
ఒక పక్క ఈ వీడియో అన్ని న్యూస్ ఛానల్స్‌లో వస్తుంటే.. మరోపక్క గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా.. వైసీపీ మీడియా, రోత పత్రిక దుర్మార్గంగా అబద్దాలు సృష్టించారని కోటంరెడ్డి అన్నారు. రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యులని చంపిన చరిత్ర మాది కాదుని.. ఆస్తి కోసం కుటుంబ సభ్యులనే ద్వేషించే సంస్కృతి మాకు లేదని స్పష్టం చేశారు. విద్యార్ధి నాయకుడిగా రౌడీమూకలని తరిమి తరిమి కొట్టానని.. నన్ను దిక్కరిస్తే అణిచివేస్తానని హూంకరించినా, ఘీంకరించినా బెదిరే ప్రసక్తే లేదన్నారు.16 నెలల ముందే జగన్‌ని ధిక్కరించానని.. నన్ను, నా కుటుంబ సభ్యులని బెదిరించినప్పుడే భయపడలేదని గుర్తుచేశారు. ఎవ్వరికీ భయపడం.. నాకోసం నడిచే వారి కోసం కొండలనైనా, బండలనైనా ఎదుర్కొని తీరతానని వెల్లడించారు.
వైసీపీ మీడియా గత కొంత కాలంగా నాపై విషం చిమ్ముతుంది. దానిని బట్టి కుట్ర వెనుక ఎవరున్నారో అర్ధం చేసుకోవచ్చు. పదమూడు నెలల కిందట మూడవసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎవరినైనా ఇబ్బంది పెట్టానా? నన్ను ఎందుకు కెలుకుతున్నారు? భయం... నా రక్తంలోనే లేదు. ఇలాంటి రౌడీలు, గూండాలని, బెదిరింపులు చాలా చూశా. భయపెడితే భయపడే వ్యక్తిని కాదు. ఎవరైనా భయపెట్టాలని చూస్తే, ఆ ప్రయత్నం పూర్తికాక ముందే భయమేమిటో చూపిస్తారు. ఇక పోలీసులూ ఎక్కడా వైఫల్యం చెందలేదు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. పోలీసులు కచ్చితంగా పనిచేస్తున్నారు కాబట్టే వీడియో బయటకొచ్చింది. అందులో ఒకరు ఇప్పటికే ఓ కేసులో అరెస్ట్ అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మా స్మార్ట్ రేషన్ కార్డు ఎక్కడుంది..
ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. హెచ్చరిక జారీ అయ్యే అవకాశం
For More Ap News