Pawan Kalyan: దేశ ఐక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Aug 14 , 2025 | 06:04 PM
దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు. నుదిటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించామని తెలిపారు.
అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవానికి సన్నద్ధమైన దేశ ప్రజలందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వతంత్ర ప్రజాస్వామ్య సౌధం మన దేశమని కొనియాడారు. మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోందంటే ఆ త్యాగధనుల ఆత్మార్పణల ఫలితమే అని గుర్తు చేశారు.
దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు. నుదిటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్రమూకలను తుదముట్టించామని తెలిపారు. వారిని పెంచి పోషిస్తున్న ముష్కరులను అన్ని విధాలుగా కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో అభేద్యమైన స్థాయికి మన భారతదేశం చేరుతున్నందుకు ప్రతి ఒక్కరం గర్విద్దామని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢ నాయకత్వంలో రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉంటూ.. అంతర్జాతీయంగా మూడో స్థానానికి చేరువయ్యామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండటం మన బాధ్యతని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
KTR Fire: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. పోరాడితే అరెస్టులా..!
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ