Share News

CM Chandrababu: సీపీ రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 17 , 2025 | 10:07 PM

సీపీ రాధాకృష్ణన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

CM Chandrababu: సీపీ రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి: ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాధాకృష్ణన్‌ గౌరవప్రదమైన రాజకీయ నాయకుడు, హుందాతనం కలిగిన నాయకునిగా మంచి పేరు ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా సీఎం రాసుకొచ్చారు. అత్యుత్తమంగా సుదీర్ఘకాలం ఆయన దేశానికి సేవ చేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడమే కాకుండా పూర్తిగా మద్దతును తెలియజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.


అభ్యర్థిత్వాన్ని టీడీపీ సమర్థిస్తుంది: లోకేశ్

ఈ మేరకు ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌‌కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రాధాకృష్ణన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆయనకున్న అపార అనుభవం దేశానికి చేసిన సేవ మరువలేనిదని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తుందని వెల్లడించారు. ఆయన విజయాన్ని సాధించాలని కాంక్షిస్తున్నట్లు లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


రాధాకృష్ణన్‌‌‌ జీవితం ఆదర్శనీయం : పవన్ కళ్యాణ్

మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌‌‌ను ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయనకు ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 40 సంవత్సరాలకు పైగా తన విశిష్టమైన జీవితంలో, కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా, జార్ఖండ్ మాజీ గవర్నర్‌గా, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్‌గా ఆయన అద్భుతమైన ప్రయాణం అంకితభావం, దార్శనిక నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన అపార అనుభవం, ప్రజలకు సేవ చేయాలనే తపన, మన దేశం విలువలు పాటించాలనే సంకల్పం ఆయనను ఒక మంచి నాయకుడిగా, అందరికీ ఆదర్శంగా మారే వ్యక్తిగా చేశాయన్నారు. రాధాకృష్ణన్‌‌‌ను ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ తరపున ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: సీఎం చంద్రబాబు

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 17 , 2025 | 10:10 PM