CM Chandrababu: తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 17 , 2025 | 08:28 PM
గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకే నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదంటూ అనంతపురం ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. చిన్న విమర్శకు సైతం ఆస్కారం ఇచ్చేలా వ్యవహారం కాకూడదంటూ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, ఆగస్టు 17: ఉచిత బస్సు పథకంపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీతోపాటు ఆ పార్టీ అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని టీడీపీ నేతలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం, అమరావతిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అదే విధంగా స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై అన్ని ప్రాంతాల్లోని ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని సీఎం చంద్రబాబుకు పార్టీ విభాగాలు వివరించాయి.
ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ - సూపర్ హిట్‌తో వైసీపీ అంతర్మథనంలో పడిందని తెలిపాయి. దీంతో ఆ పార్టీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని సీఎంకు పార్టీ వర్గాలు సోదాహరణగా వివరించాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు సీఎం పై విధంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా భాగస్వాములు అయ్యేలా చూడాలని పార్టీ యంత్రాంగానికి ఆయన సూచించారు. ప్రజలతో మమేకం కావడం ద్వారానే పథకాలకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కారణంగా తలెత్తిన వివాదాలు, ఘటనలపై సీఎం చంద్రబాబు ఈ సమావేశం వేదికగా పార్టీ వర్గాలతో చర్చించారు. ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వచ్చిన వార్తా కథనాలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అదే విధంగా అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సైతం సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారని సమాచారం.
గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకే నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదంటూ అనంతపురం ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. చిన్న విమర్శకు సైతం ఆస్కారం ఇచ్చేలా వ్యవహారం కాకూడదంటూ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయా ఘటనల్లో తప్పు లేకపోయినా.. తప్పుడు ప్రచారం జరుగుతున్నా.. వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు.
ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు, చర్యలు, ఘటనలు వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఎమ్మెల్యేలు, నేతల తప్పుల వల్ల నష్టం కలిగే పరిస్థితిని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలని నేతలను సీఎం చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. ఇక ఈ మూడు ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక కోరారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకంపై పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలపై కూడా సీఎం చంద్రబాబు సమీక్షించారు. అనంతరం వారికి ఆయన కీలక సూచనలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ
వాయుగుండం.. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు
For More AP News And Telugu News