MLC Elections Vote Counting : రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలు ఎప్పుడంటే
ABN , Publish Date - Mar 03 , 2025 | 08:43 AM
MLC Elections Vote Counting: తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇవాళ(సోమవారం) గుంటూరు - కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27వ తేదీన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ఇవాళ(సోమవారం) కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సులు కావడంతో ఫలితాలు రావడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లాలో ఉత్కంఠంగా..
గుంటూరు జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇవాళ(సోమవారం) గుంటూరు - కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా చెల్లుబాటు కానీ ఓట్లు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా సరిగా ఓట్లు వేయకపోవడంపై ఎన్నికల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్
ఏలూరు: ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 2,18,902 ఓట్లు పోలయ్యాయి. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బందితో ఓట్లు లెక్కిస్తున్నారు. 28 టేబుల్స్ 17 రౌండ్‌ల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఫలితం వెలువడటానికి కనీసం రెండు రోజులు పడుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద144 సెక్షన్ విధించారు.
విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈఈఈ విభాగంలో కౌంటింగ్
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈఈఈ విభాగంలో ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తున్నారు. లెక్కింపునకు 20 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 100 మంది సిబ్బంది, 200 మంది పోలీసులు, 160 మంది కౌంటింగ్ ఏజెంట్లు కౌటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలితే రాత్రి ఎనిమిది గంటల్లోపే విజేత ఎవరో తెలిసే అవకాశం ఉంది. గత నెల 27వ తేదీన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఆరు జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు పాల్గొన్నారు. 92.40 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల బరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మతో సహా పదిమంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రఘవర్మ, గాదె శ్రీనివాసుల నాయుడు, కోరెడ్ల విజయ గౌరీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
కరీంనగర్‌లో ఇలా..
కరీంనగర్: నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటీవల జరిగాయి. వీటి ఫలితాల కోసం ఈరోజు బ్యాలెట్ బాక్సులను తెరిచి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యూయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కిస్తున్నారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం 3 లక్షల 55 వేల 159 ఓట్లు ఉండగా.. 2 లక్షల 50వేల 106 ఓట్లు పోలయ్యాయి. టీచర్ ఎమ్మెల్సీ ఫలితం సాయంత్రం వెళ్లడయ్యే అవకాశం ఉంది. టీచర్స్ స్థానంలో బరిలో 15 మంది, పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీఎస్పీ నుంచి హరికృష్ణ మధ్యే పోటీ నెలకొంది.అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్లు లెక్కిస్తున్నారు. పోలీసులు మూడంచేలా భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూములను ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు ఓపెన్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభ కావడంతో కౌంటింగ్ హాల్‌కు పలువురు అభ్యర్థులు చేరుకున్నారు.
నల్గొండలో...
నల్గొండ : నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు 24139 పోలయ్యాయి. 93.57 ఓటింగ్ శాతం నమోదైంది. 25 టేబుళ్లపై 25 రౌండ్లలో కౌంటింగ్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 350 మంది కౌంటింగ్ సిబ్బంది, 250 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాలుగు నిమిషాల్లో ఏటీఎంలో చోరీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News