Share News

Meteorological Dept : ఈసారి భగభగలే

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:12 AM

వేసవి సీజన్‌లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారనున్నాయి. గత కొన్నేళ్లుగా వేసవిలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి.

 Meteorological Dept : ఈసారి భగభగలే

  • మే వరకూ ఎండల తీవ్రత

  • సాధారణం కంటే ఎక్కువ

  • దేశంలో అనేక ప్రాంతాల్లోనూ

  • ఐదింట నాలుగొంతుల ప్రాంతాల్లో వడగాడ్పులు

  • తెలుగు రాష్ట్రాల్లోనూ సెగలే

(విశాఖపట్నం/అమరావతి-ఆంధ్రజ్యోతి)

చలికాలం పోయి వేసవి మొదలైంది. ఈ వేసవి సీజన్‌లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారనున్నాయి. గత కొన్నేళ్లుగా వేసవిలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఈ ఏడాది కూడా తీవ్రత మరింత పెరగనుంది. అనేక ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే ఎండ మండిపోయింది. దక్షిణాదిలో పలుచోట్ల వడగాడ్పులు కొనసాగాయి. మూడు నెలలు అంటే... మార్చి నుంచి మే వరకూ ఎండ తీవ్రత క్రమేపీ పెరగనుంది. దేశంలో ఐదింట నాలుగొంతుల ప్రాంతం వడగాడ్పుల ప్రభావానికి గురికానుంది. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. మార్చి నుంచి మే వరకు మూడు నెలలకు సంబంధించి భారత వాతావరణ శాఖ అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది.

రాష్ట్రంలో అప్పుడే ఎండలు

రాష్ట్రంలో అప్పుడే ఎండలు పెరిగాయి. మార్చిలోనే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. గత నెల 24న నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలు నమోదైంది. ఈ నెల నుంచే వేసవి ప్రభావం చూపుతూ, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్‌, మే నెలల్లో భానుడు భగ్గుమనే అవకాశం ఉందని హెచ్చరించింది. గత వారం నుంచి రోజురోజుకీ 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఫిబ్రవరి నెలలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెలలో సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 27.58 డిగ్రీలు కాగా.. 29.07 డిగ్రీలు (1.49 డిగ్రీలు ఎక్కువ) నమోదైంది. ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తగ్గింది. దీంతో భూమిలో, గాలిలో తేమశాతం తగ్గడం దేశంలో వేడి పెరగడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.


ఎక్కువ రోజులు వడగాడ్పులు..

వేసవి సీజన్‌లో ప్రధానంగా మార్చి నుంచి మే వరకూ అనేక ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. అయితే దక్షిణాదిలో తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో హిమాలయాలకు ఆనుకుని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే తక్కువ నమోదవుతాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగానే ఉంటాయని, వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏపీ, తెలంగాణాల్లోనూ గాలులు

మార్చి వరకూ చూస్తే దేశంలో ఎండలు పెరగడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. దీంతో వాయవ్య, మధ్య భారతం దానికి ఆనుకుని దక్షిణాదిలో ఏపీ, తెలంగాణల్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గతేడాది కంటే మరింత తీవ్రంగా ఎండలు, వడగాడ్పులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే మార్చిలో దక్షిణ, మధ్యభారతంలో అనేక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువగా, ఉత్తరాదిలో కొన్నిచోట్ల సాధారణంగా, మిగిలినచోట్ల తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

ముందస్తు సమాచారం

విపత్తు నిర్వహణ సంస్థలోని స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులను పర్యవేక్షించి ప్రజల ఫోన్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తామని సంస్థ ఎండీ కూర్మనాథ్‌ చెప్పారు. ఎండలపై సమాచారానికి టోల్‌ఫ్రీ నంబర్లు 112,1070, 18004250101 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - Mar 03 , 2025 | 04:12 AM