Share News

Modi On Yogandhra: కేంద్ర కేబినెట్‌లో చంద్రబాబు, లోకేష్‌ను మెచ్చుకున్న ప్రధాని

ABN , Publish Date - Jun 25 , 2025 | 03:04 PM

Modi On Yogandhra: యోగాంధ్రను విజయవంతం చేసినందుకు చంద్రబాబు, లోకేష్‌లను కేబినెట్ మంత్రుల ముందు ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమం ఊహించని విధంగా జరిగిందన్నారు.

Modi On Yogandhra: కేంద్ర కేబినెట్‌లో చంద్రబాబు, లోకేష్‌ను మెచ్చుకున్న ప్రధాని
Modi On Yogandhra

న్యూఢిల్లీ, జూన్ 25: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు (బుధవారం) జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో యోగాంధ్ర ప్రస్తావనకు వచ్చింది. యోగాంధ్ర విజయవంతంమైందని కేబినెట్‌లో ప్రధాని ప్రశంసించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేష్‌ (Minister Lokesh) యోగాంధ్రను విజయవంతం చేశారని తెలిపారు. యోగాంధ్రను విజయవంతం చేసినందుకు చంద్రబాబు, లోకేష్‌లను కేబినెట్ మంత్రుల ముందు మెచ్చుకున్నారు ప్రధాని. యోగాంధ్ర కార్యక్రమం ఊహించని విధంగా జరిగిందన్నారు. ఇప్పటి వరకూ తాను ఎన్నో కార్యక్రమాలను చూశానని... కానీ యోగాంధ్రలాంటి అతి భారీ కార్యక్రమాన్ని చూడలేదన్నారు.


యోగాంధ్రను ప్రెస్టేజ్‌గా తీసుకుని చంద్రబాబు, లోకేష్ చేయడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఏపీలో నెల రోజుల పాటు యోగాంధ్రను నిర్వహించడం అన్నది మర్చిపోలేని విషయమన్నారు. అసలు 30 రోజుల పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని కలిపి యోగాంధ్రను ఎలా చేశారో నివేదిక ఇవ్వాలని ఏపీని కోరినట్లు కేబినెట్ సమావేశంలో మోదీ తెలిపారు. ఏపీ నుంచి యోగాంధ్రపై నివేదిక వచ్చిన తరువాత దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపనున్నట్లు చెప్పారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలో చంద్రబాబు, లోకేష్‌ను చూసి మిగతా వారంతా నేర్చుకోవాలని సూచించారు. యోగాంధ్ర విజయాన్ని అందరూ స్టడీ చేయాలని కేంద్ర మంత్రులకు తెలియజేశారు. యోగాంధ్రకు రెండు గిన్నీస్ రికార్డులతో పాటు పలు రికార్డులు రావడం కూడా సంతోషంగా ఉందని కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.


కాగా.. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో యోగా కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు మోదీ. ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను చంద్రబాబు, లోకేష్‌ను సభా వేదికపైనే ప్రధాని ప్రశంసించారు. తాజాగా కేబినెట్ సమావేశంలోనే యోగాంధ్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలో చంద్రబాబు, లోకేష్‌ను చూసి నేర్చుకోవాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి

కార్యకర్తలతో మాట్లాడుతాం.. ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం: మంత్రి లోకేష్

ప్రతీ కార్యకర్తను గౌరవిస్తాం: మంత్రి కొల్లు

సిట్ కస్టడీ.. జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు కాకాణి

Read latest AP News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 03:26 PM