Share News

Amaravati Quantum Valley: ఊహించనంత వేగంగా జన జీవితాల్లోకి క్వాంటం టెక్నాలజీ: ప్రద్యుమ్న

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:40 PM

Amaravati Quantum Valley: ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు అత్యంత భద్రమైన క్వాంటం క్రిప్టోగ్రఫీకి మారుతున్నాయని సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న అన్నారు. క్వాంటం కంప్యూటర్లు, టెక్నాలజీ బ్యాంకులు, రక్షణ రంగం, వైద్యారోగ్యం, విద్య ఇలా వేర్వేరు రంగాల్లో విస్తృతంగా వినియోగంలోకి వచ్చేస్తోందన్నారు.

Amaravati Quantum Valley: ఊహించనంత వేగంగా జన జీవితాల్లోకి క్వాంటం టెక్నాలజీ: ప్రద్యుమ్న
Amaravati Quantum Valley

విజయవాడ, జూన్ 25: అమరావతి క్వాంటం వ్యాలీ (Amaravati Quantum Valley) , క్వాంటం టెక్నాలజీ వర్క్ షాప్‌పై కర్టైన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 30 తేదీన క్వాంటం డేను పురస్కరించుకుని విజయవాడలో (Vijayawada) నేషనల్ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ.. క్వాంటం కంప్యూటింగ్ అనేది చాలా వేగంతో, ఖచ్చితత్వంతో కూడిన ప్రక్రియ అని తెలిపారు. ఐబీఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఈ క్వాంటం కంప్యూటర్లను రూపొందించాయన్నారు. గడిచిన 30 - 40 ఏళ్లుగా ఈ క్వాంటం కంప్యూటింగ్‌పై పరిశోధనలు జరుగుతున్నాయని.. సమీప భవిష్యత్తులో ఈ క్వాంటం టెక్నాలజీ ఊహించనంత వేగంగా జన జీవితంలోకి వచ్చేస్తుందని చెప్పారు.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు అత్యంత భద్రమైన క్వాంటం క్రిప్టోగ్రఫీకి మారుతున్నాయన్నారు. క్వాంటం కంప్యూటర్లు, టెక్నాలజీ బ్యాంకులు, రక్షణ రంగం, వైద్యారోగ్యం, విద్య ఇలా వేర్వేరు రంగాల్లో విస్తృతంగా వినియోగంలోకి వచ్చేస్తోందన్నారు. నిముషాలు, గంటల్లోనే పరిశోధన, ఉత్పత్తుల రూపకల్పన చేసే విధంగా క్వాంటం కంప్యూటింగ్, టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. క్వాంటం రివల్యూషన్‌ను అందుకోడానికి ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని యువత ఐటీ రంగంలో నిష్ణాతులు కాబట్టి ఈ రివల్యూషన్‌ను అందిపుచ్చుకుని లీడ్ చేయగల సత్తా ఏపీకి ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఏపీ కీలకమైన స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ప్రస్తుతం క్వాంటం టెక్నాలజీని వాడుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారు. జనవరిలో క్వాంటం వ్యాలీ సెంటర్‌ను ప్రారంభించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈనెల 30 తేదీన అమరావతి క్వాంటం వ్యాలీపై జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. క్వాంటం టెక్నాలజీ, క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై దేశం అంతా ఇప్పుడు ఏపీ వైపు, అమరావతి వైపు చూస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ క్వాంటం కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవాలని.. మంచి ఫలితాలు అందుకోవాలని సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న పిలుపునిచ్చారు.


ఈ సెంటర్ దేశానికే దిక్సూచి: అనిల్ ప్రభాకర్

అమరావతి క్వాంటం వ్యాలీ , క్వాంటం టెక్నాలజీపై నేషనల్ క్యాంటమ్ మిషన్ సభ్యుడు, టీసీఎస్ సలహాదారు, ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లు పరిశోధన సాగిస్తున్నాయన్నారు. ఐబీఎం, గూగుల్ లాంటి సంస్థలు క్వాంటం కంప్యూటర్లను రూపొందించి, పరిశోధన సాగిస్తున్నాయన్నారు. ఔషధాల పరిశోధన, ఈవీ బ్యాటరీలు , బిన్ ప్యాకింగ్ , కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్ లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ వినియోగం చేయొచ్చని తెలిపారు.


స్టాక్ మార్కెట్ , సైబర్ సెక్యూరిటీ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తృత సేవలు అందిస్తోందన్నారు. 1000 క్యూబిట్ కంప్యూటర్ ఇప్పుడు నిన్నటి తరంగా మారిపోయిందని.. కంప్యూటింగ్ నెట్‌వర్క్ భద్రత, పాస్‌వర్డ్‌ల సెక్యూరిటీ కోసం కేంద్రం ఖ్విలా ప్రాజెక్టు అమలు చేస్తోందన్నారు. నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవుతోందన్నారు. ఇది విద్యా సంస్థలతో పాటు పరిశ్రమలకు ప్రయోజనకారిగా మారుతుందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ సెంటర్ దేశానికి ఓ దిక్సూచిగా మారుతుందని అనిల్ ప్రభాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి కె.భాస్కర్, ఐబీఎం సంస్థ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘే, ఎల్టీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

ప్రతీ కార్యకర్తను గౌరవిస్తాం: మంత్రి కొల్లు

సిట్ కస్టడీ.. జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు కాకాణి

ఫ్రెండ్స్‌ను కలుస్తానంటూ వెళ్లిన యువతి.. ఓయో లాడ్జ్‌లో

Read latest AP News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 02:35 PM