Kakani SIT Custody: సిట్ కస్టడీ.. జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు కాకాణి
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:25 PM
Kakani SIT Custody: మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌ను సిట్ కస్టడీలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు తరలించింది. న్యాయవాది సమక్షంలో సిట్ విచారణ జరుగనుంది.

నెల్లూరు, జూన్ 25: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని (Former Minister Kakani Goverdhan Reddy) సిట్ అధికారులు (SIT Officers) కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు (బుధవారం) నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకాణిని కస్టడీలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్ అక్రమ రవాణా, ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనే కాకాణిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో న్యాయవాది సమక్షంలో విచారణ జరుగనుంది.
గతంలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో మూడు రోజుల పాటు కాకాణిని పోలీసులు విచారించగా.. మాజీ మంత్రి ఏ మాత్రం సహకరించని విషయం తెలిసిందే. దాదాపు 60 ప్రశ్నలు వేయగా.. రెండు మూడింటికే సమాధానం చెప్పి మిగిలిన వాటికి తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈరోజు కస్టడీలో సిట్ అధికారుల ప్రశ్నలకు కాకాణి ఏ మేరకు సమాధానాలు చెబుతారో చూడాలి.
ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో కాకాణి ఏ2గా ఉన్నారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని కస్టడీకి తీసుకోవాలని 2వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాపట్ల నుంచి సిట్ అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు చేరుకుని కాకాణిని కస్టడీలో తీసుకున్నారు. నేడు, రేపు అంటే రెండు రోజుల పాటు మాజీ మంత్రిని సిట్ అధికారులు విచారించనున్నారు. కాగా.. అధికారంలో ఉన్నప్పుడు కాకాణి, ఆయన బ్యాచ్ చేసిన అరాచకాలు, అన్యాయాలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా సర్వేపల్లి రిజర్వాయర్‌లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించారు. ఈ రిజర్వాయర్‌లో తవ్వకాల కోసం ఏకంగా అప్పటి ఎంపీ మాగుంట సంతకాన్నే ఫోర్జరీ చేశారు. దీనిపై జగన్ ప్రభుత్వ హయాంలోనే కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో కాకాణి ఏ2గా ఉన్నారు.
ఈ కేసులో కాకాణిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు రెండు రోజులు విచారించి.. రేపు (గురువారం) సాయంత్రం 5 గంటలకు తిరిగి నెల్లూరు జిల్లా జైలుకు తీసుకురానున్నారు. మరి రెండు రోజుల విచారణలో కాకాణి ఏమైనా నిజాలు బయటపెడతారా అనేది చూడాల్సి ఉంది. కాగా... కాకాణిపై అనేక కేసులు నమోదు అవగా.. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఇక క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. అలాగే సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ అక్కడ కూడా మాజీ మంత్రికి బెయిల్ రానటువంటి పరిస్థితి. మరోవైపు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసు, ముత్తుకూరులో అక్రమంగా టోల్‌గేట్ ఏర్పాటు చేసిన కేసులో కూడా కాకాణి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఫ్రెండ్స్‌ను కలుస్తానంటూ వెళ్లిన యువతి.. ఓయో లాడ్జ్‌లో
యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
Read latest AP News And Telugu News