Kollu Ravindra Google Data Center: పదేళ్లలో ఏపీ రూపురేఖలు మారిపోతాయ్: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:51 PM
అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్‌కు విశాఖ వేదిక కావడం గొప్ప విషయమని.. అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి, ప్రపంచం మొత్తం లింక్ చేయబోతున్నారని అన్నారు.
విజయవాడ, అక్టోబర్ 15: ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 సీట్లు టీడీపీకి పట్టం కట్టారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అంతా కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలతో పాటు, ఏపీలోనూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్‌కు విశాఖ వేదిక కావడం గొప్ప విషయమని.. అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని తెలిపారు. సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి, ప్రపంచం మొత్తం లింక్ చేయబోతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్ల తెలుగు వాడి ప్రతిష్ట విశ్వ వ్యాప్తం అవుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ విప్లవం తీసుకు వచ్చినప్పుడు చంద్రబాబును అందరూ విమర్శించారని గుర్తుచేశారు.
ఇరవై ఏళ్లల్లో హైదరాబాద్ ఎలా అభివృద్ది చెందిందో అందరూ చూశారన్నారు. ఇప్పుడు పదేళ్లల్లో ఏపీ స్వరూపం మొత్తం మారిపోతుందని తెలిపారు. రాయలసీమలోని అనేక ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటుకు అనేక మంది ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబు సారధ్యంలో అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తుంటే... ఏపీకి పెట్టుబడులు పెట్టడం జగన్‌కు నచ్చడం లేదని విమర్శించారు. అందుకే వారి పార్టీల నాయకులతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి అన్న మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు అసలు మాట్లాడే అర్హత ఉందా అని అన్నారు. నవంబర్ 15న ఇన్వెస్ట్‌మెంట్ మీట్ విశాఖలో జరగబోతోందని.. ఆర్ధిక రాజధానిగా విశాఖ ఆదర్శంగా నిలవబోతుందని అన్నారు మంత్రి.
సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజల సంక్షేమానికి సీఎం పెద్ద పీట వేశారన్నారు. ఇవన్నీ చూడలేక రాష్ట్రంలో అస్థిరిత పరిస్థితిని తీసుకువచ్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. నకిలీ మద్యం విషయంలో జనార్ధన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అందరూ చూశారని.. తప్పకుండా త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కదులుతున్న రైల్లో అమానుష ఘటన.. ఒంటరిగా ఉన్న మహిళపై....
డబుల్ ఇంజిన్ కాదు.. బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం..
Read Latest AP News And Telugu News