Nara Lokesh AP Investments: డబుల్ ఇంజిన్ కాదు.. బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం..
ABN , Publish Date - Oct 15 , 2025 | 10:48 AM
గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చబోతుందని మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు.
అమరావతి, అక్టోబర్ 15: చరిత్ర సృష్టించాలి అంటే అది చంద్రబాబు (CM Chandrababu) వల్లే సాధ్యం అవుతుందని మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.... గూగుల్ డేటా సంస్థ విశాఖకు రావడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘మా లక్ష్యం ఒకటే.. ఒకటే రాజధాని’ అని స్పష్టం చేశారు. ఎకరా భూమి 5 లక్షలకు 300 వందల ఎకరాలు ఇచ్చామని.. అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారబోతోందన్నారు. గ్రేటర్ విశాఖ 10 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
ఏపీకి పరిశ్రమల రాక...
గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చబోతుందని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని.. ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని అన్నారు. గూగుల్ పెట్టుబడి వల్ల లక్ష మందికిపైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యానని.. గూగుల్ ప్రతినిధులకు డేటా సెంటర్ స్థలాన్ని చూపించామని వెల్లడించారు. ఇది జరిగిన నెలరోజుల్లో యూఎస్‌కు వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిసినట్లు తెలిపారు. 2024 నవంబర్‌లో గూగుల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారని.. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు అనేకసార్లు భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైందన్నారు. భారీ పెట్టుబడులపై అన్నిచోట్ల చర్చలు జరుగుతున్నాయన్నారు మంత్రి.
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం...
నవంబర్‌లో మరిన్ని శుభవార్తలు ఉంటాయని ప్రకటించారు మంత్రి లోకేష్. బెంగుళూరులో ఉండలేమంటూ కొన్ని సంస్థలు చేస్తున్న ప్రకటనలకు సంబంధించి ఏపీలో వచ్చే నెలలో శుభవార్తలు ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుంటే ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బులెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తున్నామన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూముల లీజుకు ఇవ్వటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసమే ఇలా చేస్తున్నామని వివరించారు. ప్రిజనరీకి విజనరీకి మధ్య తేడా ప్రజలు గమనించాలన్నారు. విజనరీ ఆలోచనలకు హైదరాబాద్ ఓ ఉదాహరణగా చెప్పుకొచ్చారు. పరిశ్రమల్ని తరిమేయటం, వచ్చే పరిశ్రమల్ని అడ్డుకోవటమే ప్రిజనరీ ఆలోచన అంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేశారు.
వాటిని నమ్మే పరిస్థితి లేదు..
ఐదేళ్లలో గూగుల్ మొత్తం 15బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకంటే భిన్నంగా ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామన్నారు. గూగుల్‌తో ఒప్పందానికి నెల రోజుల కాలవ్యవధి పెట్టుకున్నామని.. ఒక నెల సమయం అదనంగా పట్టిందని తెలిపారు. డేటా సెంటర్లు, ఏఐ విధానాలకు తగ్గట్టుగా విద్యా వ్యవస్థ సిలబస్‌లో మార్పులు తెస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్‌లు పెట్టే తప్పుడు మెయిల్స్ ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. డేటా సెంటర్ అంటే ఏంటో గత కోడిగుడ్డు మంత్రికి తెలుసా అంటూ మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
కదులుతున్న రైల్లో అమానుష ఘటన.. ఒంటరిగా ఉన్న మహిళపై....
Read Latest AP News And Telugu News