Share News

Vangalapudi Anitha: కత్తి తీస్తే కటకటాలకే.. గుర్తుపెట్టుకోండి.. వైసీపీకి హోంమంత్రి హెచ్చరిక

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:22 PM

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ ముఠా ఎంతకైనా దిగజారుతోందని హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. మూగ జీవాలను బలి తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ పార్టీ ఉన్మాదాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.

Vangalapudi Anitha: కత్తి తీస్తే కటకటాలకే.. గుర్తుపెట్టుకోండి.. వైసీపీకి హోంమంత్రి హెచ్చరిక
Vangalapudi Anitha

అమరావతి, డిసెంబర్ 27: మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తల వికృత చేష్టలపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకులను వేటకొడవళ్లు, తల్వార్లతో కట్ చేస్తారా అని ప్రశ్నించారు. నడిరోడ్లపై అకారణంగా మూగజీవాల ఉసురు తీసి బలులు, రక్తాభిషేకాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ సైకో మూక వికృత చేష్టలు చూస్తుంటే మానవత్వం ఉందా లేదా అనిపిస్తోందన్నారు. అధికారం కోల్పోయిన తరువాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ ముఠా ఎంతకైనా దిగజారుతోందని వ్యాఖ్యలు చేశారు. మూగ జీవాలను బలి తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ పార్టీ ఉన్మాదాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. కళ్యాణదుర్గం, ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, కుప్పం, గోపాలపురం... ఇలా పలుచోట్ల మేక తలలు నరికి బహిరంగంగా నెత్తురు చల్లిన సంఘటనలు ఉన్నాయన్నారు. మీరు చేస్తున్నది తప్పు అని చెప్పిన గర్భిణీ స్త్రీ మీద వైసీపీ మూక ఉన్మాదుల మాదిరి దాడులు చేశారని ఫైర్ అయ్యారు. గర్భిణి మీద వైసీపీ సైకో దాడి జరిగితే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి తప్పు అని ఖండించలేదన్నారు. గర్భిణీపై దాడి చేసిన కేసులో నీచుడిని అరెస్ట్ చేస్తే జనసేన కార్యకర్త అని మరో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అతను జనసేన కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో ఎందుకు పాల్గొంటారని ప్రశ్నించారు.


జగన్మోహన్ రెడ్డి రాజకీయ పబ్బం కోసం 20 ఏళ్ళ లోపు యువతని బలితీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్‌కు బానిసలుగా మార్చి రాష్ట్ర యువత భవితను నాశనం చేశారని.. ఇప్పుడు రప్పా రప్పా అంటూ వైసీపీ ముఠా యువతను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. రప్పా రప్పా అంటే జైలుకు పంపడం ఖాయమని స్పష్టం చేశారు. కత్తి తీస్తే కటకటాలపాలవడం ఖాయమని వైసీపీ మూక గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఇది రాక్షసుడు నడిపే ఆటవిక వైసీపీ పాలన కాదని.. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే చంద్రన్న నాయకత్వంలో నడిచే కూటమి ప్రభుత్వ పాలన అని అన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఎటువంటి హింసను సహించదని, ఉపేక్షించదని హోంమంత్రి అనిత తేల్చిచెప్పారు.


ఇవి కూడా చదవండి...

నడిరోడ్డుపై నిలబడి ధర్మాన బ్రదర్స్‌కు దువ్వాడ సవాల్

ఎంతకు దిగజారారు.. పవన్ ఫొటోపై అసభ్యకర పోస్ట్...

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 27 , 2025 | 04:50 PM