Rammohan Naidu: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోంది..
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:08 PM
2026వ సంవత్సరం జూన్‌లో భోగాపురం ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ రాకపోకల కోసం ఏడు ప్రధాన రహదారులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
విజయనగరం: భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, కేంద్రమంత్రిగా తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 86 శాతం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు పూర్తైనట్లు పేర్కొన్నారు. రన్ వే, ఎర్త్ వర్క్, ట్యాక్సీ స్టాండ్ల పనులు ఇప్పటికే పూర్తైనట్లు చెప్పారు. టెర్మినల్, ఏటీసీ, బిల్డింగ్స్, కనెక్టింగ్ రోడ్ల పనులు త్వరలో పూర్తవుతాయని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
2026వ సంవత్సరం జూన్‌లో భోగాపురం ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టుకు వచ్చేందుకు ఏడు ప్రధాన రహదారులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖ నుంచి ఎయిర్ పోర్ట్ రాకపోకల కోసం సులభతరమైన రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. 2026 ఏప్రిల్‌లోపు ఏడు రహదారులను పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుసంధానంగా బీచ్ కారిడార్ పనులూ త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీచ్ కారిడార్ అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ విషం కక్కుతోందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు పెట్టుబడిదారులను భయపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే.. వైసీపీ అడుగడుగునా అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తికాని మెడికల్ కాలేజీల కోసం మాత్రమే పీపీపీ మోడల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు, కూటమి నేతలపై వైసీపీ రౌడీయిజం చేస్తోందని రామ్మోహన్ నాయకుడు ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!