PVN Madhav: సుపరిపాలన యాత్రకు విశేష స్పందన: పీవీఎన్ మాధవ్
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:25 AM
అటల్, చంద్రబాబులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లకు నాడు వాజ్‌పేయి సహకారం అందించారని గుర్తుచేశారు.
విజయవాడ, డిసెంబర్ 24: అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో వాజ్‌పేయి విగ్రహాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేటి తరానికి వాజ్‌పేయి విలువలు ఆదర్శమని అన్నారు. వాజ్‌పేయి గొప్పతనం తెలుసుకుని అందరూ ఆశ్చర్యవ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సుపరిపాలన యాత్ర గురించి సీఎం చంద్రబాబుకు చెప్పిన వెంటనే ఆనందం వెలిబుచ్చారని తెలిపారు. ఈ యాత్రకు కూటమిపరంగా , ప్రభుత్వపరంగా సహకారం అందించారని చెప్పారు.
ఈ యత్రలు, సభల్లో కూటమి పార్టీల నేతలను భాగస్వామ్యం చేశారన్నారు. అటల్, చంద్రబాబులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లకు నాడు వాజ్‌పేయి సహకారం అందించారని గుర్తుచేశారు. సుపరిపాలన యాత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారన్నారు. వాజ్‌పేయి ఈ దేశానికి చేసిన సేవకు, త్యాగాలను గురించి అందరూ ముక్త కంఠంతో కీర్తిస్తున్నారని తెలిపారు. ఈనెల 25న వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో స్మృతి వనం, విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు.
ధర్మవరం నుంచి అమరావతి వరకు తమ యాత్రకు ప్రజలు నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామాలకు రోడ్లు, ఐటీ, టెలికం, పొలిటికల్ కనెక్టివిటీలకు ఆద్యులు వాజ్‌పేయి అని కొనియాడారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే తేడా లేకుండా ప్రజలు నుంచి వస్తున్న స్పందన అపూర్వమన్నారు. నేటి యువతరం, భవిష్యత్తుతరాలు వాజ్‌పేయి గొప్పతనం తెలుసుకోవాలని సూచించారు. తాము ఏర్పాటు చేసిన విగ్రహాలు, యాత్ర ద్వారా వాజ్‌పేయి నుంచి చాలా మంది స్పూర్తి పొందుతున్నారన్నారు.
వాజ్‌పేయి ఆశయాలకు అనుగుణంగా మోదీ అద్భుతమైన పాలన సాగిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్, వికసిత్ ఏపీ కోసం అందరం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. సుపరిపాలన యాత్రలకు, సభలకు సహకారం అందించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈనెల 25న జరిగే వాజ్ పేయి భారీ విగ్రహం ఆవిష్కరణ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
LVM-3 M-6 రాకెట్ ప్రయోగం విజయవంతం..
Read Latest AP News And Telugu News