Share News

Tirumala Tirupati Devasthanams: కొండపై కల్తీకి కట్టడి

ABN , Publish Date - Dec 24 , 2025 | 05:17 AM

కల్తీ నెయ్యి, నాణ్యత లేని దినుసులతో శ్రీవారి ప్రసాదాలను తయారుచేసి జగన్‌ పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన వ్యవస్థల ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన...

Tirumala Tirupati Devasthanams: కొండపై కల్తీకి కట్టడి

  • ఫలిస్తున్న టీటీడీ కఠిన చర్యలు

  • సరఫరాలైనా, భక్తులు ఇచ్చినవైనా..శాంపిల్‌ ల్యాబ్‌కు పంపి నిర్ధారణ

  • తేడా అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కృతి

  • దీంతో మెరుగుపడిన నెయ్యి నాణ్యత

  • పాతిక లారీల జీడిపప్పు వెనక్కి..

  • ప్రసాదాలపై ఆగిన ఫిర్యాదులు

  • సర్కార్‌ ‘ప్రక్షాళన’పై భక్తుల్లో సంతృప్తి

(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

కల్తీ నెయ్యి, నాణ్యత లేని దినుసులతో శ్రీవారి ప్రసాదాలను తయారుచేసి జగన్‌ పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన వ్యవస్థల ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ప్రభావం కొండపై కనిపించడం మొదలైంది. నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకుల నాణ్యతపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కఠిన వైఖరి అవలంబిస్తోంది. కొంచెం తేడా అనిపించినా సరుకులను నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది. ఫలితంగా నెయ్యి సహా దినుసుల నాణ్యత గత ఏడాదిన్నర కాలంలో పెరిగింది. ప్రసాదాలు బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెయ్యి నాణ్యతపై ప్రస్తుతం ఎలాంటి ఫిర్యాదులూ రావడం లేదు. గత ఏడాదిన్నర కాలంగా ఒక్క నెయ్యి ట్యాంకర్‌ కూడా వెనక్కి తిప్పి పంపే అవసరం రాలేదు. అలాగే ఇతర సరుకుల నాణ్యత విషయంలో కూడా రాజీ పడడం లేదు. గతేడాది జూలై నుంచి ఈ నెల మొదటి వారం వరకు కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ పది లక్షల కిలోల నెయ్యి టీటీడీకి సరఫరా చేసింది. ఈ ఏడాదన్నర వ్యవధిలోనే వేర్వేరు టెండర్లలో పాల్గొన్న ఈ డెయిరీ కిలో రూ.498 నుంచి రూ.716 వరకూ వేర్వేరు ధరలతో నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. నందిని డెయిరీ టెండరు గడువు ముగిసిన నేపఽథ్యంలో ప్రస్తుతం గుంటూరు జిల్లా సంగం డెయిరీ 10 లక్షల కిలోలు, మహరాష్ట్రలోని పుణెకు చెందిన ఇందాపూర్‌ డెయిరీ 6.50 లక్షల కిలోలు, తిరుపతికే చెందిన మదర్‌ డెయిరీ 3.50 లక్షల కిలోలు చొప్పున టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. ఈ డెయిరీలు కిలో రూ.655 ధరతో నెయ్యి చేరవేస్తున్నాయి. నాణ్యత లేదనే కారణంగా ఏడాదిన్నరగా ఒక్క ట్యాంకరు నెయ్యి కూడా టీటీడీ నుంచి వెనక్కి వెళ్లలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండళ్లు ఆమోదించిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం టీటీడీ కొనుగోలు చేస్తున్న నెయ్యి ధరలు రెట్టింపు ఉన్నాయి. నాణ్యత విషయంలో రాజీ పడకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. ఈ నెయ్యి వినియోగించి తయారు చేసే శ్రీవారి ప్రసాదాలపై భక్తుల నుంచీ ఫిర్యాదులు లేవు.


తేడా కొడితే..

టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం ఏటా రూ.600 కోట్ల విలువైన 177 రకాల సరుకులు, ఇతర వస్తువులు (ఆహార సంబంధమైనవి) కొనుగోలు చేస్తోంది. అందులో రోజువారీ వినియోగం చూస్తే నెయ్యి 15 వేల కిలోలు, జీడిపప్పు 3,500 కిలోలు, చక్కెర 40 వేల కిలోలు, బియ్యం 20 వేల కిలోలు, బెల్లం రెండు వేల కిలోలు, ఎండు ద్రాక్ష 1,500 కిలోలు, యాలకులు 500 కిలోలు ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాలలో ఎక్కువగా వినియోగించే జీడిపప్పు తరచుగా నాసిరకం వస్తున్నట్టు టీటీడీ అధికారులు గుర్తించారు. ప్రతి పది లోడ్‌లలో రెండు నుంచి మూడు లోడ్‌ల సరుకు నాణ్యత లేకుండా వస్తున్నాయని గుర్తించారు. ఇలాంటి లోడ్‌లను నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకూ 18 నెలల కాలంలో 25 లారీల లోడ్‌ల జీడిపప్పును తిరస్కరించినట్టు సమాచారం. ఇదే వ్యవధిలో పది లోడ్‌ల ఎండు ద్రాక్ష, ఏడు లోడ్‌ల చింతపండు, పది లోడ్‌ల కందిపప్పు, పది లోడ్‌ల వరకూ ఎండుమిర్చిలను వెనక్కి పంపినట్టు సమాచారం.

నాణ్యత లేకుంటే దాతలు ఇచ్చినా తిసర్కరణ

టీటీడీకి అవసరమైన సరుకులను ఎంతోమంది భక్తులు విరాళంగా అందజేస్తుంటారు. అందులో కూరగాయలు మొదలుకుని నిత్యావసర సరుకుల వరకూ ఉంటున్నాయి. శ్రీవారి అన్న ప్రసాదాలకు సంబంధించి తిరుపతిలోని టీటీడీ వేర్‌ హౌస్‌ ప్రాంగణానికి రోజూ భక్తులు వచ్చి తమకు తోచిన వస్తువులు ఇచ్చి వెళుతుంటారు. కొందరు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా ఇలా చేస్తుంటారు. బియ్యం, చక్కెర, జీడిపప్పు, నెయ్యి, కందిపప్పు, చింతపండు వంటివి ఎక్కువగా ఇస్తున్నారు. అయితే వాటి శాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపి నాణ్యత బాగుంటేనే స్వీకరిస్తున్నారు. టీటీడీ వేర్‌హౌస్‌ ప్రాంగణంలో నాలుగు గోదాములున్నాయి. మొదటి గోదాములో 60 రకాల సరుకులు, రెండో గోదాములో మరో 60 రకాల సరుకులు, మూడో గోదాములో 57 రకాల సరుకులు నిల్వ ఉంచుతున్నారు. మరొక దానినిసబ్‌ గోదాముగా అత్యవసరానికి వాడుతున్నారు. ఇక... తిరుమలలోని గోదామును నెయ్యి, చక్కెరల నిల్వకు మాత్రమే వినియోగిస్తున్నారు.

Updated Date - Dec 24 , 2025 | 05:17 AM