ISRO: LVM-3 M-6 రాకెట్ ప్రయోగం విజయవంతం..
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:24 AM
ఇస్రో చరిత్రలోనే అతి భారీ ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2ను LVM-3 M-6 రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది.
తిరుపతి, డిసెంబర్ 24: శ్రీహరి కోటలో LVM-3 M-6 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. తొలిసారిగా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపింది. కేవలం 15 నిమిషాల్లోనే బ్లూబర్డ్ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ (AST) స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించింది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4G, 5G సేవలను బ్లూ బార్డ్ బ్లాక్-2 అందించనుంది. ఎల్‌వీఎం 3 రాకెట్ సిరీస్‌లో ఇది 9వ ప్రయోగం.
ఇస్రో చైర్మన్ స్పందన...
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. బాహుబలి ప్రయోగం విజయవంతమైందన్నారు. ఎల్‌వీఎంప్రయోగాల్లో సంపూర్ణ విజయాలు సాధిస్తున్నామని తెలిపారు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతం చేశామన్నారు. అమెరికన్ కస్టమర్ కోసం ప్రయోగం చేపట్టామని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటన్నారు. 34 దేశాలకు ఇస్రో సేవలందిస్తోందని అన్నారు. గగన్‌యాన్ కోసం ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోందని తెలిపారు. ఇస్రోపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని ఇస్రో చైర్మన్ తెలిపారు.
ఈ ప్రయోగం ఇస్రోకి చారిత్రాత్మకమైన విజయమన్నారు. వాణిజ్య ప్రయోగాలలో మరోసారి సత్తా చాటామని తెలిపారు. అత్యంత కీలకమైన ఈ ప్రయోగం 52 రోజుల్లోనే సిద్ధం చేసి ప్రయోగం చేపట్టామని చెప్పారు. మన శాస్త్రవేత్తల సమిష్టి విజయం.. ఎల్‌వీఎం 3 - ఎం 6 రాకెట్ ప్రయోగం అని చెప్పుకొచ్చారు. ఈ ప్రయోగ విజయం తమకు అత్యంత ధైర్యాన్ని కల్పించిందన్నారు. ఎల్‌వీఎం ప్రయోగాలలో ఈ ప్రయోగం మూడవ వాణిజ్య ప్రయోగమని వెల్లడించారు. ఎల్‌వీఎం రాకెట్లనే చంద్రయాన్ 4, 5కు ఉపయోగిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మానవ రహిత ప్రయోగాలని చేపట్టబోతున్నామని ప్రకటించారు. వాణిజ్య ప్రయోగ ఒప్పందాలు పూర్తయిన వెంటనే వరస వాణిజ్య ప్రయోగాలని చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో నావిగేషన్ ప్రయోగాలు, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Read Latest AP News And Telugu News