Gold Theft Allegations in Tirumala: వరాహస్వామినీ వదల్లేదు!
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:15 AM
కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ, పట్టువస్త్రాల కొనుగోళ్లలో అవినీతి.. ఇలా గత జగన్ ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి....
విమాన గోపురం బంగారు తాపడంలో చేతివాటం
102 గ్రా. అపహరించడానికి యత్నించినట్లు గుర్తింపు
2022 నాటి చోరీని దాచిపెట్టిన అప్పటి టీటీడీ అధికారులు
గోవిందరాజస్వామి ఆలయ పనుల్లోనూ గోల్‌మాల్?
ఈవో ఏకే సింఘాల్‌కు ఫిర్యాదులు
(తిరుమల-ఆంధ్రజ్యోతి)
కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ, పట్టువస్త్రాల కొనుగోళ్లలో అవినీతి.. ఇలా గత జగన్ ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తిరుమలలోని వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనుల్లో చేతివాటం చూపించారు. పనులు జరిగే సమయంలో కాంట్రాక్టర్, జ్యువెలరీ అప్రైజర్ కుమ్మక్కై 102 గ్రాముల బంగారాన్ని లిక్విడ్ రూపంలో అపహరించేందుకు యత్నించినట్టు అప్పటి విజిలెన్స్ విచారణలో బయటపడింది. తిరుమలలోని వరాహస్వామి ఆలయ విమానంపై 2020 డిసెంబరులో బంగారు తాపడం పనులను టీటీడీ చేపట్టింది. ఏడాదిపాటు ఈ పనులు జరిగాయి. రాగి రేకులపై బంగారు పూత పూసే పనిని తమిళనాడుకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఇందుకోసం 38 కిలోల 360 గ్రాముల 700 మిల్లీగ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని టీటీడీ అందజేసింది. తిరుపతి జ్యువెలరీ నుంచి తిరుమల పేష్కార్ కార్యాలయానికి ఏడు విడతల్లో ఈ బంగారాన్ని పంపారు. పనులు పూర్తయిన తర్వాత రికార్డులో 38 కిలోల 366 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బంగారాన్ని వినియోగించినట్టు చూపడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా బంగారు పూత పనుల్లో కొంత వ్యర్థమై తగ్గుతుంది. కానీ ఇక్కడ మాత్రం పెరిగింది. ఇదే సమయంలో బంగారాన్ని ఆమ్లంలో కరిగించి తరలిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ మొదలైంది. స్ట్రాంగ్ రూంలో పాదరసం, శుద్ధికి ఉపయోగించే ఆమ్ల ద్రావణం నిల్వ ఉంచినట్టు గుర్తించారు. ఈ ద్రావణాలను నిపుణుల సాయంతో పరీక్షించగా వీటిలో బంగారం కలగలిసి ఉన్నట్టు తేలింది.
పాదరసంలో బంగారం
2022 జూన్ 30న చేసిన పరీక్షలో పాదరసంలో 45.700గ్రాముల బంగారాన్ని గుర్తించారు. రెండోసారి మరికొంత పాదరసాన్ని పరీక్షించగా 15.900 గ్రాముల బంగారం బయటపడింది. అదే ఏడాది ఆగస్టు 1న ఆమ్ల ద్రావణం నుంచి మరో 28.900 గ్రాములు వెలికి తీశారు. ఇలా 90.500 గ్రాముల లెక్కల్లో లేని బంగారాన్ని వెలికితీశారు. రికార్డుల్లో అదనంగా చూపినదానితో కలిపి మొత్తం 102 గ్రాముల అదనపు బంగారాన్ని గుర్తించారు. జ్యువెలరీ అప్రైజర్, కాంట్రాక్టర్ మధ్య జరిగిన కొన్ని ఫోన్ సంభాషణలను టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలించింది. తాపడం పనుల్లో కొట్టేసే బంగారంలో అప్రైజర్ 10 శాతం కమీషన్ కోరినట్టు అందులో ఉంది. 2022 ఆగస్టులో విజిలెన్స్ విచారణలో ఇదంతా బయటపడింది. నాటి వైసీపీ ప్రభుత్వంలోని బోర్డు, టీటీడీ అధికారులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలుచేపట్టినా, విషయాన్ని బయటకు పొక్కకుండా దాచిపెట్టారు.
‘గోవిందరాజస్వామి’ పనుల్లోనూ...
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ విమానం బంగారు తాపడం పనుల్లోనూ భారీ ఎత్తున బంగారాన్ని కొట్టేశారంటూ తాజాగా టీటీడీ ఈవోకు ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి దీనిపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ‘గోవిందరాజస్వామి ఆలయ విమాన పనులను తీసుకున్న కాంట్రాక్టర్... వాటిని ఓ ముస్లిం కాంట్రాక్టర్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, నాణ్యత లేని బంగారు పెయింట్, ఎంసీల్ ఉపయోగించి 30 నుంచి 50 కేజీల బంగారం మాయం చేశారని అరోపణలు వచ్చాయి. 2023లో ఈ అంశంపై కొన్ని హిందూ సంఘాలు ప్రెస్‌మీట్లు పెట్టి ధర్నాలు చేశాయి. దీనిపై విజిలెన్స్ అప్పట్లోనే విచారణ చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత ముస్లింలు పనులు చేశారనడానికి ఆధారాలు లేవని విజిలెన్స్ నివేదికలో స్పష్టం చేసింది. నిరంతర భద్రత ఉన్నందున బంగారం దొంగతనం జరిగే అవకాశమే లేదని పేర్కొంది. ఏఈవో జ్యువెలరీ, అప్రైజర్, డీఈఈ, ఈఈ పర్యవేక్షణలోనే పనులు సాగాయని తెలిపింది. అయితే ఇదే అంశంపై తాజాగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో జగన్ జమానాలో జరిగిన ఈ అంశంపై కూడా విజిలెన్స్ విభాగం మరోసారి పరిశీలన చేయనున్నట్టు తెలిసింది.
కేజీల కొద్దీ బంగారం దోచేశారు: కిరణ్ రాయల్
జగన్ హయాంలో గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై బంగారు తాపడం పనుల్లో కేజీలకొద్దీ బంగారం దోచేశారని జనసేననేత కిరణ్ రాయల్ ఆరోపించారు. గోపురానికి 9 లేయర్ల తాపడం చేయకుండా 2లేయర్లతో కానిచ్చేశారని చెప్పారు. గోపురంపై ఉన్న 32 విగ్రహాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. త్వరలోనే టీటీడీ సీవీఎ్‌సవోను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే తిరుమల విగ్రహాలను కూడా మార్చేసేవారన్నారు.