CM Chandrababu: వాజ్‌పేయి చూపిన మార్గంలోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:04 PM
అమరావతిలో ఒక చరిత్రను సృష్టించే విధంగా వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈనెల 11 నుంచి అటల్ మోదీ సురిపాల యాత్రను ప్రారంభించారని తెలిపారు. అమరావతిలో 14 అడుగుల వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సీఎం తెలిపారు.
అమరావతి, డిసెంబర్ 25: ఈరోజు ఒక చరిత్ర.. ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు అటల్ - మోడీ సుపరిపాలన యాత్ర ముగింపు సభలో సీఎం మాట్లాడుతూ.. శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నరోజును.. ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతిలో జరుపుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దేవతల రాజధాని ఏ విధంగా ఉందో ఊహించుకుంటున్నారన్నారు. అమరావతిని ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునేలా చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాంత రైతులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని.. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33వేల ఎకరాల భూమిని 29వేల మంది రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చారని తెలిపారు. అటువంటి స్పూర్తిని ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.
వాజ్‌పేయి మంచి వక్త...
అమరావతిలో ఒక చరిత్రను సృష్టించే విధంగా వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈనెల 11 నుంచి అటల్ మోదీ సురిపాల యాత్రను ప్రారంభించారని తెలిపారు. అమరావతిలో 14 అడుగుల వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సీఎం తెలిపారు. శాశ్వతంగా ప్రజలకు గుర్తుండిపోయేలా ఈ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దేశానికి సుపరిపాల యాత్రను పరిచయం చేసిన వ్యక్తి వాజ్‌పేయి అని.. అందుకే మోదీ డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించారన్నారు. ఆరోజు వాజ్‌పేయి, నేడు మోదీ విలక్షణమైన వ్యక్తిత్వం, చరిత్రను తిరగరాసే నాయకత్వం వారిలో ఉందని చెప్పుకొచ్చారు. తనకు ఎప్పుడూ స్పూర్తిని ఇచ్చే నేత ఎన్టీఆర్ అని అన్నారు. దేశంలో యాంటీ కాంగ్రెస్ కోసం పని చేసిన నేతలు వాజ్‌పేయి, ఆ తర్వాత ఎన్టీఆర్ మాత్రమే అని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాడు కుట్రతో కూలిస్తే.. అండగా నిలబడిన వ్యక్తులు వాజ్‌పేయి, అద్వానీ మాత్రమే అని గుర్తుచేశారు. నేషనల్ ఫ్రంట్ పెట్టి చైర్మన్‌గా వాజ్‌పేయికు సహకరించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. డిసెంబర్ 25న గ్వాలియర్‌లో సామాన్య కుటుంబంలో వాజ్‌పేయి పుట్టారని.. జనసంఘ్ బీజేపీ నుంచి 10 సార్లు ఎంపీ, రెండుసార్లు రాజ్యసభకు ఎంపిక అయ్యారని తెలిపారు. మంచి వక్తతో పాటు, అద్భుతమైన కవి, మానవతావాది వాజ్‌పేయి అని అన్నారు.
నాడు కార్గిల్ యుద్ధం.. నేడు ఆపరేషన్ సింధూర్
ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తాను చాలా సన్నిహితంగా ఉన్నానని.. అటల్ పని చేసే ఆలోచనలు బాగా తెలిసిన వ్యక్తిని తానే అని తెలిపారు. దేశ ప్రగతికి గట్టి పునాది వేసిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. మనం జాతీయ రహదారులపై తిరుగుతున్నామంటే ఆద్యుడు వాజ్‌పేయి అని కొనియాడారు. పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచించి.. ఆచరణలో పెట్టిన వ్యక్తి వాజ్‌పేయి అని సీఎం వెల్లడించారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక వసతులు కల్పన వంటివి ఏర్పాటు చేసి సంపదను సృష్టించిన వ్యక్తి వాజ్‌పేయి అని తెలిపారు. విమానాల గురించి అడిగితే వెంటనే అనుమతులు ఇచ్చారని.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు హైదరాబాద్‌లో వచ్చిందంటే అటల్ జీ కారణమన్నారు. దేశంలో లక్షా 46వేల కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఆరోజు అణు పరీక్షలు చేస్తే డబ్బులు ఇవ్వమని అమెరికా ఆంక్షలు పెడితే.. తనకు దేశం ముఖ్యమని అణుపరీక్షలు చేసిన వ్యక్తి వాజ్‌పేయి అని వెల్లడించారు. నాడు వాజ్‌పేయి కార్గిల్ యుద్ధం.. నేడు మోదీ ఆపరేషన్ సింధూర్ చరిత్రలో మిగిలిపోతాయన్నారు. దేశం జోలికి వస్తే ఖబడ్దార్ అని నిరూపించిన నాయకులు వాజ్‌పేయి, నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు.
2047 నాటికి నెంబర్ వన్‌గా భారత్..
కొంతమంది నాయకులు శాశ్వతంగా స్పూర్తిని ఇస్తారని.... దేశం కోసం బతుకుతారని, దేశం కోసం ఆలోచిస్తారన్నారు. మరికొంత మంది నాయకులు మాత్రం స్వార్ధం కోసమే ఆలోచిస్తారని.... స్వార్థం కోసమే పని చేస్తారని విమర్శించారు. ఈ భారతదేశం ఉన్నంత కాలం భారతీయుల గుండెల్లో ఉండే వ్యక్తి వాజ్‌పేయి అని స్పష్టం చేశారు. అందుకే అమరావతిలో విగ్రహం, స్మృతి వనం పెట్టుకున్నామని వివరించారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్, వాజ్‌పేయి చేసిన సేవలు గుర్తుండిపోయేలా ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుందని వెల్లడించారు. ప్రపంచంలో భారత్ దేశం 11వ స్థానంలో ఉంటే... మోదీ సారథ్యంలో నాలుగో స్థానంలోకి తెచ్చారన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా తయారు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ సత్తా, ఆ శక్తి నరేంద్ర మోదీకి ఉందన్నారు. ఆరోజు వాజ్‌పేయి, ఎన్టీఆర్... దేశం కోసం ఆలోచించారని, తెలుగు జాతీ కోసం ఆలోచన చేశారని.. నేడు మోదీ, తాను కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపే బాధ్యత తీసుకుంటున్నామని తెలిపారు.
మోదీ పూర్తి సహకారం..
అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని.. ఇంకా గేర్ పెంచుతామన్నారు. ఐటీకి సంబంధించి సైబరాబాద్‌లో హైటెక్ సిటీని ఓపెన్ చేసిన వ్యక్తి వాజ్‌పేయి అని తెలిపారు. నేడు అమరావతిలో క్వాంటమ్ బిల్డింగ్‌ను త్వరలోనే ఓపెన్ చేసుకోబోతున్నామని చెప్పారు. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, అభివృద్ధికి మోదీ పూర్తిగా సహకారం అందిస్తున్నారని చెప్పారు. మొన్నటి వరకు వెంటిలేటర్‌పై ఉన్న ఏపీ.. ఇప్పుడు తిరిగి కోలుకుని, నిలబడే పరిస్థితికి వచ్చామన్నారు. వాజ్‌పేయి చేసిన అభివృద్ధి, చూపిన దారి, స్పూర్తి, పీపీపీల ద్వారా సంపదను సృష్టించారని.. ఇప్పుడు ఏమీ తెలియని నాయకులు పీపీపీ గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మెరుగైన సేవలు అందించాలన్నా.. సంపద సృష్టించాలన్నా.. ఉద్యోగాలు కల్పించాలన్నా.. పీపీపీ మోడల్ కరెక్ట్ అని అందరం చూశామన్నారు. కొంతమంది అబద్ధాలు ప్రచారం చేయడమే కాకుండా.. అభివృద్ది పనుల్లో భాగస్వామ్యం అయితే జైలులో పెడతామనే నాయకులు తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద, ఆనందం, ఆరోగ్యం.. ఈ మూడు ప్రతిఒక్కరికీ అందించే దిశగా ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఆనాడు వాజ్‌పేయి, ఎన్టీఆర్ స్పూర్తి.. ఇప్పుడు తమకు పూర్తిగా సహకారం అందించే వ్యక్తి నరేంద్రమోదీ అని చెప్పుకొచ్చారు. ఈ స్పూర్తిని ఇంటింటికీ తీసుకు వెళ్లే బాధ్యత తీసుకోవాలని కూటమి నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
ఇవి కూడా చదవండి...
కేంద్రమంత్రి శివరాజ్‌ను ఇంటికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
అయ్యో పాపం... ఆకలి బాధ భరించలేక ఓ వ్యక్తి
Read Latest AP News And Telugu News