Handloom Workers Financial Struggles: బతుకు బరువు.. ఉపాధి కరువు.. నేతన్నకు ఆర్థిక కష్టాలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 09:08 AM
వైసీపీ ప్రభత్వ ఐదేళ్ల పాలనలో చేనేత రంగాన్ని పక్కన పెట్టింది. 2018 నుంచి బకాయిలను నిలిపివేసింది. కొన్ని చేనేత కార్మిక కుటుంబాలకే ఏడాదికి రూ.24 వేల చొప్పున ఇచ్చింది. కానీ, రోజువారీ పని కల్పించకపోవడంతో నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చేనేత.. లేదు చేయూత
పనిలేదు.. ఆరేళ్లుగా రాయితీ లేదు..!
జిల్లాలోని 33 సంఘాల్లో కష్టాలు
చేనేత వస్త్రాలను కొనని ఆప్కో
అప్పుల ఊబిలో సహకార సంఘాలు
రోడ్డున పడుతున్న కార్మికులు
వైసీపీ పాలన నుంచీ ఇదే పరిస్థితి
జీఎస్టీ పూర్తిగా తగ్గించాలని డిమాండ్
చేనేత రంగానికి చేయూత కరువైంది. నేతన్నకు రోజువారీ జీవనం కష్టంగా మారింది. సరిపడా పనిలేక, భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియక అనారోగ్య సమస్యలు, అప్పులతో కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేనేత వస్త్రాల తయారీ ఆదుకోకపోవడంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉత్పత్తులకు జీఎస్టీని మినహాయిస్తోందని, చేనేత వస్త్రాలకు కూడా ఆ అవకాశం కల్పించాలని నేతన్నలు కోరుతున్నారు.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం: వైసీపీ ప్రభత్వ ఐదేళ్ల పాలనలో చేనేత రంగాన్ని పక్కన పెట్టింది. 2018 నుంచి బకాయిలను నిలిపివేసింది. కొన్ని చేనేత కార్మిక కుటుంబాలకే (Handloom Workers) ఏడాదికి రూ.24 వేల చొప్పున ఇచ్చింది. కానీ, రోజువారీ పని కల్పించకపోవడంతో నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో 39 చేనేత సహకార సంఘాలు ఉండగా, పెడన పరిసర ప్రాంతాల్లోనే 23 ఉన్నాయి. ఈ 33 సంఘాలకు, రూ.10 కోట్లకు పైగా బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆరేళ్లుగా చేనేత వస్త్రాలకు రిబేటు ఇవ్వకుండా నిలిపివేయడంతో ఈ సంఘాలన్నీ ఆర్థికపరమైన చిక్కుల్లో పడ్డాయి.
పెరగని మజూరీ ధరలు
ఆరేళ్లుగా చేనేత వస్త్రాల మజూరీ ధరలు పెరగలేదని కార్మికులు చెబుతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని ఈ ధరలను పెంచాలని కార్మికులు కోరుతున్నారు. రూ.1,000 ధర పలికే చీరను నేస్తే కార్మికులకు కూలీగా కేవలం రూ.300 మిగులుతోంది. ఇందులో జీఎస్టీ రూ.120 వసూలు చేస్తుండటంతో భారం పడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు ఎప్పుడో..
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అప్పట్లో ఆ పార్టీకి చెందిన రాజకీయ నిరుద్యోగులకు నామినేటెడ్ పద్ధతిలో ప్రతి ఆరునెలల కోసారి సంఘాల్లో త్రీమెన్ కమిటీల పేరుతో ఉపాధి కల్పించారు. దీంతో పూర్తిస్థాయి పాలకవర్గాలు లేక చేనేత సంఘాల్లో పరిపాలన దాదాపు కుంటుపడింది. వస్త్ర ఉత్పత్తి లేని సమయంలో పాలకవర్గాలు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవడంతో సంఘాలు మూతపడే దశకు చేరుతున్నాయి. కూటమి ప్రభుత్వంలోనైనా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, ఆర్థిక వెసులుబాటు కల్పించాలని, ఈ రంగానికి జవసత్వాలు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.
ఆదుకోని ఆప్కో
చేనేత వస్త్రాలను కొనేందుకు ఆప్కోను ఏర్పాటు చేశారు. అయితే, దీనిద్వారా చేనేత సంఘాల నుంచి వస్త్రాలు కొనట్లేదు. పవర్‌లూమ్స్‌పై తయారైన వస్త్రాలనే కొంటూ బిల్లులు మంజూరు చేస్తోంది. చేనేత వస్త్రాలను తక్కువ మొత్తంలో కొనుగోలు చేసినా బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఈ ప్రభావం చేనేత సంఘాలపై పడుతోంది. కార్మికులు తయారు చేసిన వస్త్రాలను సర్వశిక్ష ద్వారా కొంటామని ఆప్కో చెబుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..
కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.. అసలు విషయమిదే..
Read Latest Andhra Pradesh News and National News