Pulivendula ZPTC: ముగిసిన జెడ్పీటీసీ ప్రచారం.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం
ABN , Publish Date - Aug 10 , 2025 | 07:11 PM
అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపై రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో(ఆదివారం) ప్రచారానికి తెరపడింది. దీంతో తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.
కడప: రాజకీయ నాయకుల మధ్య సవాళ్లు.. మాటల యుద్ధాలు.. ఘర్షణల మధ్య నువ్వా..నేనా అన్నట్టుగా.. సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ప్రచారం నేటితో ముగిసింది. దీంతో జెడ్పీటీసీ ఎన్నిక ప్రాంతాల నుంచి ఇరు పార్టీల నేతలు బయటకు వెళ్లిపోయారు. వాడివేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి చోటా పోలీసులు భద్రతా బలగాలను ఏర్పాటు చేసుకుని నిఘా పెడుతున్నారు.
అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై ఏపీ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో(ఆదివారం) ప్రచారానికి తెరపడింది. దీంతో తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. గడచిన మూడు దశాబ్దాల్లో పులివెందుల జెడ్పీటీసీ సీటుకు ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1995, 2006, 2013, 2021లో ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలతో ఏకగ్రీవాలకు తెరపడిందని చెప్పుకోవచ్చు. పులివెందుల మున్సిపాల్టీలో కలిసిన గ్రామాలు మినహా మిగతా ఐదు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఈ ఉపఎన్నిక జరుగతోంది.
నిన్నటి వరకు పులివెందుల వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ భావన బలహీన పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఎన్నడూ లేని విధంగా టీడీపీలో చేరికలని చెప్పవచ్చు. టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి పెద్దఎత్తున టీడీపీలో చేరికలు జరుగుతున్నాయి. రోజూ చేరికలతో టీడీపీలో జోష్ నిండుతోంది. మరోవైపు ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని వైసీపీ చూస్తోంది. మాజీ సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీ అవినాష్‌రెడ్డి ఇతర వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంతగడ్డపై టీడీపీ ఇస్తున్న పోటీతో ఆ పార్టీకి సీటు దక్కించుకోవడం సవాల్‌గా మారింది. అయితే ప్రస్తుతం జరుగుతోంది జడ్పీటీసీ ఉపఎన్నిక మాత్రమే. ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంటుంది. అయినా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో సీఎం ఆకస్మిక పర్యటన
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!