Share News

Land Registration Fraud: ఏపీలో భూ రిజిస్ట్రేషన్ స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - Dec 16 , 2025 | 07:04 AM

బి.కోడూరు మండలంలో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రిజిస్టరు పొలాలను కూడా అగ్రిమెంట్లతో యథేచ్ఛగా ఆన్‌లైన్‌ చేశారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి పిత్రార్జిత భూములు కూడా దొంగ అగ్రిమెంట్లు తయారుచేసి తహశీల్దారు కార్యాలయంలో ఆన్‌లైన్‌ చేయించుకున్నారు.

 Land Registration Fraud: ఏపీలో భూ రిజిస్ట్రేషన్ స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు
Land Registration Fraud

  • అగ్రిమెంట్లతో ఆన్‌లైన్‌..!

  • ఆపై రిజిస్ర్టేషన్లు

  • గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యం

  • ప్రభుత్వ ఆదాయానికి గండి

బి.కోడూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బి.కోడూరు మండలంలో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రిజిస్టరు పొలాలను కూడా అగ్రిమెంట్లతో యథేచ్ఛగా ఆన్‌లైన్‌ చేశారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి పిత్రార్జిత భూములు కూడా దొంగ అగ్రిమెంట్లు (Land Registration Fraud) తయారుచేసి తహశీల్దారు కార్యాలయంలో ఆన్‌లైన్‌ చేయించుకున్నారు.


దొంగ అగ్రిమెంట్లతో ఆన్‌లైన్‌ చేయించుకున్న వారు వేరే వారికి పొలం అమ్మి రిజిస్టరు చేయించారు. ఇలాంటివి మండలంలో కోకొల్లలుగా ఉన్నాయి. గతంలో అనువంశిక పిత్రార్జిత భూములు రిజిస్టరు చేయించుకుంటేనే అవి చెల్లుబాటు అయ్యేవి. ఆ పొలాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి అవసరం ఉన్న రైతులు రుణాలు పొందేవారు. ఇప్పుడు కొన్న పిత్రార్జిత భూములు అగ్రిమెంట్లు ఉంటే చాలు ఆన్‌లైన్‌ చేసేశారు.


గతంలో భూముల రిజిస్ట్రేషన్‌ అంటే..

అప్పట్లో భూములు కొన్నా అమ్మినా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారు. భూములు కొన్నవారు అమ్మిన వారి చేత రిజిస్టరు చేయించుకుని.. అమ్మిన వారు, కొన్నవారు, సాక్షులు కలిసి భోజనం చేసి తాంబూలాలు స్వీకరించిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఎంతమంది రిజిస్ట్రేషన్‌కు వచ్చారో వారందరికీ ఒక్కొక్కరికి ఒక డజను అరటిపండ్లు ఇచ్చేవారు.


ఆ సంప్రదాయం ఎందుకంటే ఫలానా వారి భూమి ఫలానా వారు కొన్నారని అందరికీ తెలియాలని. ఇదంతా గతం. వైసీపీ హయాంలో మొదలుపెట్టిన అగ్రిమెంట్లతో ఆన్‌లైచేసే విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గడమే కాకుండా.. దొంగ అగ్రిమెంట్లతో రిజిస్ట్రేషన్‌ కూడా చేసేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అయినా ఈ విధానానికి స్వస్తి పలకాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దారు దస్తగిరయ్యను వివరణ కోరగా.. అగ్రిమెంటుపై ఆన్‌లైన్‌ అయిన పొలాలు చెల్లవని అన్నారు. అవి ఒరిజినల్‌ పొలాలు అయితే తప్పనిసరిగా రిజిస్టరు చేయించుకోవాలని అన్నారు.


ప్రభుత్వ ఆదాయానికి గండి

పిత్రార్జిత భూములు రిజిస్టరు చేయించుకుంటే ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఆదాయం అందుతుంది. అలా కాకుండా అగ్రిమెంట్లతో ఆన్‌లైన్‌ చేయించుకుంటే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. రిజిస్టరు భూములు పక్కా రిజిస్టరు చేయించుకోక తప్పదు.

- లక్కిరెడ్డి రాఘవరెడ్డి, రైతు, పాయలకుంట్ల


ఈ వార్తలు కూడా చదవండి..

ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత

ముగిసిన భవానీ దీక్షలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 16 , 2025 | 07:36 AM