First Telugu inscription: తొలి తెలుగు శాసనానికి అరుదైన గౌరవం
ABN , Publish Date - Dec 18 , 2025 | 07:33 AM
దేశబాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన తొలి తెలుగు శాసనం ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల గ్రామం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండటం గర్వకారణం.
కలమల్లలో క్రీ.శ 575లో ఏర్పాటు చేసిన రేనాటి చోళరాజు
తొలి తెలుగు శాసనం మనదే
21న కడపలో రెప్లికా ఆవిష్కరణ
ఎర్రగుంట్ల / కడప ఎడ్యుకేషన్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): దేశబాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు (Sri Krishna Devarayalu) కొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన తొలి తెలుగు శాసనం (First Telugu inscription) ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల గ్రామం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండటం గర్వకారణం. క్రీ.శ. 575లో నాటి రేనాటి చోళరాజు ధనుంజయుడు తొలితెలుగు శాసనాన్ని ఇక్కడ వేయించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆయన పరిపాలనలో తెలుగుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే క్రీ.శ. 1479లో సదాశివ దేవరాయులు ఆధ్వర్యంలో రెండవ శాసనం వేయించారు. క్రీ.శ. 1525లో ఓరవీర ప్రతాపరాయులు మూడవ శాసనం, 1529లో శ్రీకృష్ణదేవరాయుల పరిపాలనలో 4వ శాసనాన్ని వేయించారు. అప్పట్లో తెలుగు బాషపై ఉన్న మక్కువ, గౌరవం నాటి రాజుల తీరును బట్టే అర్థమౌతోంది.
1904లో వెలుగులోకి..
ఇక్కడున్న తొలి తెలుగుశాసనాన్ని 1904వ సంవత్సరంలో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. 1947-48లో ఆచార్య నీలకంఠశాస్త్రి, ఎం.వేంకటరామయ్య లు ఈ శాసనాన్ని పరిశీలించి ప్రచురణలోకి తెచ్చారు. లిపి ఆధారంగా ప్రప్రథమ తెలుగు శాసనంగా భారతీయ పురావస్తు శాఖ అంగీక రించింది. తొలి తెలుగు శాసనాన్ని భావితరా లకు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం 5వ తరగతి పాఠ్య పుస్తకాల్లో చేర్చిం ది. శాసనంలో మొత్తం 11 పంక్తులు ఉండగా ప్రస్తుతం 7 పంక్తులు మాత్రమే ఉన్నాయి. ఎరికల ముత్తురాజు అనే బిరుదు గల రాజు అంటూ ఈ శాసనం ప్రారంభమవుతుంది. బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు లిపి ఎలా పరిణామం చెందిందో ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. ధర్మశాస్త్రాలను ఉల్లంఘించే వారికి శిక్షల ప్రస్తావన ఉంది. కలమల్ల శాసనం తెలుగు భాష, చరిత్రకు సంబంధించిన ఒక ఆధారం.
గత ఏడాది తెలుగుభాషా దినోత్సవం
గత ఏడాది ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా కలమల్లలో తెలుగు బాషా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిషన్‌ను తిలకించారు. తెలుగు శాసనాలు తరిగిపోకుండా, భావితరాలకు మరింత చేరువ చేసేలా, గొప్పదనాన్ని చెప్పేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు అధికారులు కనీసం తొలి తెలుగు శాసనాలు తడవకుండా, ఎండకుండా కనీసం రేకుల షెడ్డుకూడా వేయలేదు. తెలుగు తొలి శాసనాలను కాపాడుకునేందుకు, సురక్షితంగా భావితరాలకు చేరవేసేందుకు ఇక్కడ మందిరం నిర్మించాలని స్థానికులు, ఆలయ పరిరక్షణ కమిటివారు కలెక్టర్‌ను కోరారు. నాలుగు శాసనాలను ఒకేచోట చేర్చి ఉంచారే తప్ప మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదు.
భవిష్యత్తు తరాల కోసం..
ప్రారంభంలో సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న ఈ రాతి శాసనం, ప్రస్తుతం నాలుగు అడుగులు ఎత్తుకు పరిమితమైంది. అక్షరాలు మసకబారి చదవలేని స్థితికి చేరడంతో, ఈ అమూల్య చారిత్రక ఆధారం పూర్తిగా నశించే ప్రమాదం ఏర్పడింది. ఇది కేవలం రాతి శాసనం మాత్రమే కాదు, తెలుగు భాష స్వతంత్రతకు, సామాజిక చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీని ప్రతిరూపం (రెప్లికా) ఏర్పాటు చేయాలని జానమద్ది సాహితీ పీఠం భావించింది. దీనికి స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ సహకారం అందించారు. జానమద్ది హనుమచ్ఛాస్ర్తి శతజయంతి ఉత్సవాలలో భాగంగా కడప నగరం సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం ప్రాంగణంలో ఈనెల 21వ తేదీన కలమల్ల శాసనం రెప్లికాను ఆవిష్కరించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత
ముగిసిన భవానీ దీక్షలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..
Read Latest AP News And Telugu News