Nara Brahmani: హిందూపురం వస్తే.. పుట్టింటికి వచ్చినట్లుంది..
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:42 PM
హిందూపురం వస్తే.. తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉంటుందని రాష్ట్రమంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, విద్యర్థులు బ్రాహ్మణికి ఘనస్వాగతం పలికారు.
- పురం పర్యటనపై నారా బ్రాహ్మణి
హిందూపురం: హిందూపురం రావడంతో పుట్టింటికి వచ్చినట్లుందని ఐటీ, విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి(Nara Brahmani) అన్నారు. నియోజకవర్గంలోని చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. చిలమత్తూరు జూనియర్ కళాశాల, లేపాక్షి మండలం కుర్లపల్లి, హిందూపురం మండలం పూలకుంట ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు అదించారు. లేపాక్షి నవోదయలో సోలార్ గీజర్లను పరిశీలించారు. వీటిని హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో అందించినట్లు తెలిపారు.

హిందూపురం అంటే నందమూరిపురమనీ, ఇక్కడి నుంచి తమ తాత నందమూరి తారకరామారావు, పెదనాన్న హరిక్రిష్ణ, తండ్రి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ లెక్కన నందమూరి కుటుంబానికి నియోజకవర్గంతో ఎంత బలమైన బంధం ఉందో అర్థం అవుతుందన్నారు. భవిష్యత్తులో కూడా చదువుకు హెరిటేజ్ సంస్థ సహాయసహకారాలు అందిస్తుందన్నారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను నేర్చుకుని సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలన్నారు.

చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం పాఠశాలల్లో నారా బ్రాహ్మణికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి, ఘనంగా స్వాగతించారు. ఆమెపై విద్యార్థులు పూలు చల్లుతూ పాఠశాలలోకి ఆహ్వానించారు. పాఠశాల గదులు, లైబ్రెరీలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, పూలకుంట సర్పంచ్ మంజునాథ్, ఎమ్మెల్యే పీఏ బాలాజీ, నాయకులు రామకృష్ణారెడ్డి, గంగాధర్, శ్రీనివాసులు, చంద్రప్ప పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News