AP Cabinet Approves Key Decisions: అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:27 AM
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో నిర్మించే వైద్య కళాశాలల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది..
పీపీపీ నిర్వహణలో ఉన్నా సర్కారు పేరుతోనే ఉంటాయి
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానం
ఆ కాలేజీలకిచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడకూడదు
625 పడకల ఆస్పత్రి ఉండాలి
150 యూజీ, 24 పీజీ సీట్లతో కళాశాల, వసతి గృహాలు
ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులకు ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరి
పోలవరంలో రూ.542 కోట్లతో మరిన్ని పనులు
ప్రైవేట్ నిర్వహణకు ఫైబర్‌నెట్
క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించే వైద్య కళాశాలల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పీపీపీ విధానంలో నిర్మించి, నిర్వహించినా.. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి అనే పేరు పెట్టాలని నిర్ణయించింది. ప్రైవేటు ఆయుష్ ఆస్పత్రుల నియంత్రణ కోసం ఇక నుంచి రిజిస్ర్టేషన్ తప్పనిసరి చేస్తూ తీర్మానించింది. శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార-పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలకు కేటాయించిన కేటాయించిన భూముల్లో 60 ఎకరాల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘పీపీపీ విధానంలో వైద్య కళాశాలలకు కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు, వైద్యేతర కార్యక్రమాలకు వినియోగించరాదని స్పష్టం చేసింది. ఈ భూముల్లో 625 పడకల ఆస్పత్రి, 150 యూజీ, 24 పీజీ సీట్లతో కూడిన కళాశాల, వసతి గృహాలు, బోధన, బోధనేతర సిబ్బంది నివాసాల నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. భవిష్యత్ అవసరాల కోసం ఆయా వైద్య కళాశాలలు... దంత వైద్య, నర్సింగ్ కాలేజీలను, టెలిమెడిసిన్, శిక్షణ, ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఈ అదనపు అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంలో 3శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది’ అని తెలిపారు.
వైద్య కళాశాలలకు భూముల కుదింపు..
మొదటి దశలో చేపట్టే 4 వైద్య కళాశాలలకు గత ప్రభుత్వం 257.50 ఎకరాలు కేటాయించగా.. దానిని 197.71 ఎకరాలకు కుదిస్తూ వైద్యఆరోగ్య శాఖ చేసిన సిఫారసుకు క్యాబినెట్ ఆమోదించింది. పీపీపీ విధానంలో వైద్యకళాశాల, ఆస్పత్రి నిర్వహణలోకి వచ్చినప్పటి నుంచి బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్య, ఇతర సిబ్బందికి జీతాలను రెండేళ్లపాటు ప్రభుత్వమే భరిస్తుంది. కొత్తఆస్పత్రుల నిర్మాణం పూర్తయ్యాక ప్రస్తుత బోధనాస్పత్రులను తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రి అనే పేరుతో పాటు ప్రదేశం పేరు కూడా పెట్టి, దాని కింద పీపీపీ భాగస్వామి పేరును కూడా ప్రస్తావించవచ్చు. ఈ పేర్లను 70ః30 నిష్పత్తిలో ప్రదర్శించాలి. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అన్ని రకాల పడకల్లో 70శాతం నగదు రహిత సేవలు పొందే పేదలకు కేటాయించాలని నిర్ణయించారు.
మరిన్ని నిర్ణయాలివీ..
పోలవరం ప్రాజెక్టులో భాగంగా రూ.542.55 కోట్లతో చేపట్టిన మూడు అనుబంధ పనులకు ఆమోదం. పోలవరం గ్రామం నుంచి కుడివైపున స్పిల్‌వే కనెక్టింగ్ టన్నెల్స్, రేడియల్ డ్యామ్‌ల దాకా అనుసంధాన రహదారుల నిర్మాణానికి రూ.117.86 కోట్లు వ్యయమైంది. గ్యాప్-1 నుంచి పోలవరం ఎడమ కాలువకు హెడ్‌రెగ్యులేటర్, కేఎల్ బండ్ వరకు 21 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు రూ. 217.55 కోట్లు ఖర్చుచేయడానికి అంగీకారం. పురుషోత్తపట్నం నుంచి గండిపోచమ్మ తల్లి గుడిదాకా 6 కిమీ మేర రూ.207.50 కోట్లతో రక్షణ పనులు.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ లావాదేవీలు, యాజమాన్య నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఆమోదం.
పట్టణాలు, నగరాల్లో ఖాళీ భూమిపై విధిస్తున్న పన్నులో 50ు భవన నిర్మాణ దశలో మినహాయిస్తూ తెచ్చిన ముసాయిదా బిల్లుకు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్‌బాషా/దూదేకుల సంక్షేమ, అభివృద్ధి సంస్థను రద్దు చేసి.. సహకార సంఘాల చట్టం-1964 ప్రకారం ‘ఏపీ నూర్‌బాషా/దూదేకుల సహకార ఆర్థిక సంస్థ’ అనే కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
ఏపీ రెగ్యులేషన్-కంట్రోల్ ఆఫ్ డిస్‌ప్లే డివైసె్‌స(ప్రమోషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసె్‌స)కు ఆమోదం. తద్వారా హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఇతర ప్రచార పరికరాల ఏర్పాటుకు లైసెన్సుల అనుమతి తప్పనిసరి.
ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు పీఎంఎ్‌సజీఎంబీవై కింద రూఫ్‌టాప్, గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ఇన్‌స్టాలేషన్ల అమలుకు నాబార్డు నుంచి రూ.3,762.26 కోట్ల రుణం పొందడానికి ప్రభుత్వ గ్యారెంటీ.
2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా తాజాగా 5 వేల కోట్లు రుణం తీసుకుని.. పౌరసరఫరాల సంస్థకు బదలాయింపునకు అంగీకారం.
నోటిఫైడ్ పార్ట్‌నర్స్ అధికారానికి సంబంధించి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం 480 ఎకరాల భూమిని భాగస్వాములకు కేటాయించడానికి రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా (గూగుల్ అనుబంధ సంస్థ) అభ్యర్థనకు ఆమోదం.
ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ కోసం ప్రస్తుత అర్హత తేదీకి అదనంగా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1 తేదీలను ఆమోదించడానికి ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణకు ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనకు ఆమోదం.
సవరించిన భారత్ నెట్ ప్రోగ్రాం అమలుకు కొత్త ఎస్పీవీ ఏర్పాటు.. దాని అమలుకు త్వరగా టెండర్ల విడుదలకు ఆమోదం.
కాంట్రాక్టర్లు, ఏజెన్సీల బిల్లుల నుంచి కార్మిక సెస్ రికవరీకి ఓకే. జూ 2024 జూన్ 15 వరకు జరిగిన భూలావాదేవీల క్రమబద్ధకరణకు అనుమతి. ‘ఫామ్ టెన్’ క్లెయిముల దాఖలు గడువు 2027 డిసెంబరు 31 వరకు పొడిగింపు.