Share News

Parakamani Theft Case: రాజీ వెనుక రహస్యమేంటో?

ABN , Publish Date - Nov 29 , 2025 | 05:19 AM

పరకామణి చోరీ కేసు రాజీ విషయంలో అంతా పథకం ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన విషయాలను వ్యూహాత్మకంగా దాచేసి....

Parakamani Theft Case: రాజీ వెనుక రహస్యమేంటో?

(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

పరకామణి చోరీ కేసు రాజీ విషయంలో అంతా ‘పథకం’ ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన విషయాలను వ్యూహాత్మకంగా దాచేసి... ‘మాకేమీ తెలియదు’ అనేలా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. నిందితుడు రవికుమార్‌ ఆస్తులను స్వీకరించే విషయం టీటీడీ బోర్డు సమావేశం అజెండాలో పెట్టినప్పటికీ... అందులో రవికుమార్‌ పరకామణి చోరీ కేసు నిందితుడనే సంగతి దాచేశారు. రవికుమార్‌ ఆస్తులను స్వీకరించే విషయంపై 2023 జూన్‌ 19న జరిగిన టీటీడీ బోర్డు సమావేశం అజెండాలో ప్రతిపాదన పెట్టారు. రవికుమార్‌, అతడి భార్య రమ్య తమ ఆస్తులను ఏడు గిఫ్ట్‌ డీడ్‌ల ద్వారా టీటీడీకి విరాళంగా రాసిచ్చారని మాత్రమే పేర్కొన్నారు. సాధారణ భక్తుడి నుంచి స్వీకరిస్తున్నట్టుగా తీర్మానాన్ని (నంబరు 159) వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదించేసింది. భక్తులు శ్రీవారికి సమర్పించే ఆస్తులను టీటీడీ స్వీకరించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. టీటీడీ భక్తుల ఆస్తులను విరాళంగా తీసుకునే ముందు ప్రకటన ఇవ్వాలి. ప్రజల నుంచి ఈ ఆస్తుల విషయంలో అభ్యంతరాలు, సూచనలు ఏవైనా ఉంటే తెలుసుకునేందుకు దినపత్రికల్లో పబ్లిక్‌ నోటీసు ప్రచురించాలి. న్యాయ, సాంకేతికపరమైన అభ్యంతరాలు లేనప్పుడే గడువు తర్వాత ఆస్తులను తీసుకోవాలి. అయితే టీటీడీ రవికుమార్‌ ఆస్తులను తీసుకునే ముందు పబ్లిక్‌ నోటీసు ఇవ్వలేదు. తగిన సమయం లేదంటూ టీటీడీ బోర్డు మినహాయింపు ఇచ్చింది. రవికుమార్‌ ఆస్తుల అంశాన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్టుగా తీర్మానించింది. ఆ మినహాయింపును ఆ ఒక్కసారికే పరిమితం చేస్తున్నట్టుగా పేర్కొనడం విశేషం. వాస్తవానికి రవికుమార్‌, అతడి భార్య రమ్య రూ. 14.43 కోట్ల విలువైన (ప్రభుత్వ ధరల ప్రకారం) తమ ఆస్తులను ఏడు గిఫ్ట్‌ డీడ్‌ల ద్వారా టీటీడీ పేరిట రిజిష్టర్‌ చేశామని, వాటిని విరాళంగా అనుమతించాలని కోరుతూ 2023 మే 19వ తేదీన టీటీడీకి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత నెల రోజులకు అంటే.. జూన్‌ 19న టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. అంత వ్యవధి ఉన్నప్పటికీ టీటీడీ పబ్లిక్‌ నోటీసు జారీ చేయలేదు.

ప్రభుత్వానికి సమాచారం లేదు

సాధారణంగా భక్తుల నుంచి ఆస్తులను విరాళంగా స్వీకరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం టీటీడీకి లేదు. అయితే ఇక్కడ ఆస్తులు టీటీడీకి విరాళంగా ఇచ్చింది సాధారణ భక్తుడు కాదు. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ చేసి పట్టుబడిన వ్యక్తి. తిరుమలలో నమోదైన క్రిమినల్‌ కేసులో రవికుమార్‌ నిందితుడు. అలాంటి వ్యక్తి నుంచి ఆస్తులు స్వీకరించే సమయంలో ప్రభుత్వానికి తెలియజేయకపోవడం విచిత్రం. లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ చేసుకోవడానికి కూడా బోర్డు అనుమతి లేకపోవడం గమనార్హం. దీంతో తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలకు ఆస్కారం కలిగింది. అదే చివరికి హైకోర్టు ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు చేపట్టడానికి కారణమైంది.

Updated Date - Nov 29 , 2025 | 05:20 AM