Nandamuri Balakrishna: చంద్రబాబు ప్రపంచానికే బ్రాండ్
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:38 PM
కూటమి ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని.. దీంతో తాము ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయామని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు13, (ఆంధ్రజ్యోతి): రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి (Basavatarakam Cancer Hospital) ఎన్నో అవార్డులు వచ్చాయని.. అత్యుత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా దేశంలో మంచి పేరు తెచ్చుకుందని ఆ ఆస్పత్రి చైర్మన్, ప్రముఖ నటుడు, తెలుగుదేశం హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఉద్ఘాటించారు. క్యాన్సర్ ఆస్పత్రి లాభాపేక్ష కోసం కాదని.. దాతల సహకారంతో ఆస్పత్రి నడుస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని తమ క్యాన్సర్ ఆస్పత్రికి కూడా ఎన్నో అవాంతరాలు అధిగమించి నిర్మాణం పూర్తి చేశామని గుర్తుచేసుకున్నారు. ఇవాళ(బుధవారం) అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు.
2019లో క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన..
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందని నందమూరి బాలకృష్ణ గుర్తుచేశారు. తర్వాత ఏపీలో కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని.. దీంతో తాము ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయామని వివరించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు చేపట్టామని ఉద్ఘాటించారు. ఇవాళ పండుగ వాతావరణంలో ఆస్పత్రి పనులు ప్రారంభించామని వెల్లడించారు. అమరావతిలో రాత్రి భారీ వర్షం కురిసిందని, అయినా ముహూర్తం ప్రకారం పనులు ప్రారంభించామని తెలిపారు. వర్షం రూపంలో భగవంతుడు తమపై ఆశీస్సులు కురిపించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా దివంగత నేత కోడెల శివప్రసాద్ చేసిన సేవలు గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ.
తక్కువ ఖర్చుతో వైద్యం...
‘అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలనేది మా తల్లి బసవ తారకం కోరిక. ఆమె కోరిక మేరకు అత్యున్నత వైద్యాన్ని క్యాన్సర్ రోగులకు అందిస్తున్నాం. క్యాన్సర్ రోగులకు రేడియేషన్ కోసం అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చాం. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా ప్రజల వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్ నిపుణులు నోరి దత్తాత్రేయ ఈ ఆస్పత్రికి ఇస్తున్న సహకారం మరువలేనిది. అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రికి మొదటి విడతలో రూ.750 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీని కోసం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, దాతలు ముందుకు వస్తున్నారు. మొదటి విడత పనులు 2028లోగా పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్రానికి మా కృతజ్ఞతలు. గుండె జబ్బుల స్థానంలో క్యాన్సర్ జబ్బులు ఇటీవల పెరిగాయి. క్యాన్సర్ పరిశోధనలు కూడా ఇక్కడే నిర్వహించేలా సౌకర్యాలు కల్పిస్తాం’ అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ కుమారుడుగా పుట్టడం నా అదృష్టం..
‘ఎన్టీఆర్ కుమారుడుగా పుట్టడం నా అదృష్టం. ఆయన ఒక ఆదర్శ పురుషుడు, నటనకు ఒక అలంకారం. చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు, మరణం లేని చిరస్మరణీయులు.. ఆయన లాంటి జీవితం ఎవరికి రాదు, ప్రపంచంలోనే గొప్ప నటుడు. ప్రతి తెలుగు బిడ్డకు ఎన్టీఆర్ ఒక ధైర్యం. బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజకీయంగా పైకి తెచ్చిన వారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు. ఎన్టీఆర్ లాగా చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమం అమలు చేస్తున్నారు. అమరావతి రైతులకు తలవంచి నమస్కరిస్తున్నా. చంద్రబాబు ప్రపంచానికే బ్రాండ్. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు లాభం చేకూరలా రాజధాని నిర్మాణం చేస్తున్నారు. హిందూపూర్ ప్రజలను కూడా అభినందనలు. నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.. చంద్రబాబు నాకన్నా వేగంగా పరిగెడుతున్నారు. నేను తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లు. నన్ను ఆదరించిన వారికి ధన్యవాదాలు. నా అభిమానులకు కృతజ్ఞతలు. నేను ఈ సమాజంలో ఒక కర్షకుడిని. ఇప్పటికే నా నాలుగు సినిమాలు వరుస హిట్లు. అఖండ -2 కూడా భారీ విజయం సాధిస్తుంది. బాలకృష్ణ అంటే అటూ రాజకీయం..ఇటు సినిమా రంగం అయినా ఒకటే’ అని అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
బాలకృష్ణ వేగానికి త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి ఆస్పత్రి: నోరి దత్తాత్రేయుడు
అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించడం సంతోషంగా ఉందని క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వేగానికి త్వరలోనే అమరావతిలో ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిలో సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. 2028లో ఆస్పత్రి వైద్య సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు.