Palanadu Accident: పల్నాడు రోడ్డు ప్రమాదంలో వీడిన మిస్టరీ.. జరిగింది ఇదే
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:37 AM
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు విచారణ జరిపి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌కు కారును అడ్డుపెట్టి ఆపడం వల్ల మరో కారు వచ్చి ఢీకొట్టినట్లు విచారణలో తేలింది.
పల్నాడు, డిసెంబర్ 8: జిల్లాలోని చిలకలూరిపేట వద్ద మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ రహదారిపై ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌కు కారును అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం జరిగిందని... కారును అడ్డంపెట్టడం వల్లే కంటైనర్‌ను వెనుక నుంచి మరో కారు ఢీకొట్టినట్లు విచారణలో తేలింది. అయితే నరసరావుపేట డీఎస్పీ ఆఫీస్‌లో పనిచేసే ఏఎస్‌ఐ కుమారుడు కంటైనర్‌ను ఆపినట్లు పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా ఏఎస్‌ఐ కుమారుడి ఆగడాలను కూడా పోలీసులు బయటపెట్టారు. సదరు ఏఎస్‌ఐ కుమారుడు.. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అవతారం ఎత్తి అక్రమవసూళ్లకు పాల్పడుతున్నట్లుగా విచారణలో పోలీసులు తేల్చారు. ఎప్పటిలాగే బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌గా మారి జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఆపైన ఏఎస్‌ఐ కుమారుడు.. ఐదుగురు విద్యార్థుల మృతికి కారకుడిగా నిలిచాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా.. ఈనెల 4న చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయ్యప్ప మాల ధరించిన విద్యార్థులు ఒంగోలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరంతా కూడా గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఒంగోలుకు కారులో వెళ్తున్న విద్యార్థులు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. వేగంగా దూసుకొచ్చి ఢీకొనడంతో కారు పూర్తిగా కంటైనర్ కిందికి వెళ్లిపోయింది. దీంతో ఐదుగురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. అయ్యప్పమాలలో ఉన్న విద్యార్థులు శబరిమల యాత్రకు వెళ్లేందుకు స్వగ్రామలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కుక్కల బెడదకు చెక్.. షెల్టర్‌జోన్ ఏర్పాటు
సాగునీటి పంపిణీ అస్తవ్యస్తం.. రైతుల గగ్గోలు
Read Latest AP News And Telugu News