Payyavula Fires on Jagan: ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:47 AM
ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు. ఎన్నికల వాగ్దానాలను గుర్తుపెట్టుకుని అమలు చేసి ఉంటే వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చేది కాదని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.
అమరావతి , సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ పునర్నిర్మాణం (AP PRC Revision), బకాయిల చెల్లింపు అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఇవాళ(గురువారం) ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల (AP Employees) పట్ల వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) దుర్మార్గంగా వ్యవహారించిందని ఆరోపించారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును సైతం జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసిందని విమర్శించారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఉద్యోగుల విషయంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం అమలు చేయకుండా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆక్షేపించారు. ఎన్నికల వాగ్దానాలను గుర్తుపెట్టుకుని అమలు చేసి ఉంటే వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చేది కాదని చెప్పుకొచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్.
గత జగన్ ప్రభుత్వం 94 కేంద్ర ప్రభుత్వ పథకాల సొమ్మునూ ఇతర అవసరాలకు వాడేసిందని గుర్తుచేశారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుందని ఉద్ఘాటించారు. గతంలో తెలంగాణ కంటే ఒకశాతం ఎక్కువ అంటే...43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ప్రభుత్వం తమదేనని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని తెలిపారు. ఐఆర్ కంటే తక్కువగా 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి అన్యాయం చేశారని మండిపడ్డారు. కరోనా పేరు చెబుతూ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ను వైసీపీ సర్కారు తగ్గించిందని మండిపడ్డారు. కరోనా పేరు చెప్పి గత జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికంటే ఎక్కువ నిధులు తీసుకుందని వివరించారు మంత్రి పయ్యావుల కేశవ్.
రెండేళ్లుగా రావాల్సిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కరోనా పేరు చెప్పి ముందే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే రూ.40 వేల కోట్ల అదనంగా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిందని గుర్తుచేశారు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందని ఉద్ఘాటించారు. ఉద్యోగులకు గత జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయిల చెల్లింపునకు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 2024 నుంచి 2025 మధ్యలో ఉద్యోగులకు సంబంధించి రూ. 11,496 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. 2025నుంచి 2026లో ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రూ.3,549 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఉద్యోగుల వేతనాల పెంపు కోసం పీఆర్సీ కమిషన్ నియామకంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పీఆర్సీ నియామకంపై సరైన సమయంలోనిర్ణయం తీసుకుంటారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
27న విజయవాడలో ప్రత్యేక ఎగ్జిబిషన్.. ముఖ్య అతిథిగా బాలయ్య
లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..
Read Latest AP News And Telugu News