Minister Lokesh : ఏపీలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయండి.. గూగుల్‌ను కోరిన మంత్రి లోకేష్
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:17 PM
విశాఖపట్నంలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పూర్తిచేశామని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ సూచించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) కోరారు. గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్‌తో మంత్రి లోకేష్ ఇవాళ(బుధవారం) సింగపూర్‌లో భేటీ అయ్యారు. ఈ సదర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. విశాఖపట్నంలో డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్ 11వ తేదీన ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ చేసుకుందని గుర్తుచేశారు. ఏపీలోని యువతను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని ప్రోత్సహించడానికి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి గూగుల్‌తో మరో ఎంఓయూ చేసుకుందని చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్.
విశాఖపట్నంలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పూర్తిచేశామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్నందున వైజాగ్‌లోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్‌లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. గూగుల్ క్లౌడ్ ప్రపంచంలోనే అతిపెద్ద డాటా సర్వర్ వినియోగదారుల్లో ప్రధానమైందని ఉద్ఘాటించారు మంత్రి నారా లోకేష్.
చైనా/తైవాన్‌కు దూరంగా ఏపీలో తయారీని ప్రారంభించడానికి గూగుల్ ఏపీ ద్వారా సర్వర్ సప్లయ్ చైన్‌కు కనెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. గూగుల్ క్లౌడ్ లేదా సర్వర్ సరఫరాదారు దాని మరమ్మతు, నిర్వహణ సేవలకు గ్లోబల్ హబ్‌గా ఏపీని ఉపయోగించుకోవచ్చని ఆకాక్షించారు. బలమైన ఎయిర్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ ఉండటంతో సంబంధిత కార్యకలాపాలకు ఏపీ అనుకూలంగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ విషయంపై గూగుల్ క్లైడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్ స్పందిస్తూ... ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్న ప్రాజెక్టులతోపాటు ఏపీ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
సెమీ కండక్టర్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలి: మంత్రి నారా లోకేష్
ఏపీలో సెమీ కండక్టర్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్కంతో మంత్రి లోకేష్ బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక క్లస్టర్‌లలో అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని లోకేష్ సూచించారు. ఐవీపీ సెమీ పర్యావరణ వ్యవస్థ - నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి పార్ట్ సరఫరాదారులుగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో తమిళనాడుకు పొరుగున ఉన్న ఏపీ ప్రాంతీయ సహకారాన్ని తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజా మాణిక్కం తెలిపారు.
అలాగే, డీటీడీఎస్ సీఈఓ చక్రవర్తితో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. డీటీడీఎస్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు సహకరించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
లిక్కర్ కుంభకోణంలో సంచలనం.. విచారణలో సిట్ దూకుడు
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. పెట్టుబడులపై కీలక చర్చలు
Read latest AndhraPradesh News And Telugu News