Guntur Digital Arrest Scam: డిజిటల్ అరెస్టు పేరుతో హెడ్ మాస్టర్‌కే టోకరా..
ABN , Publish Date - Dec 19 , 2025 | 08:12 PM
గుంటూరు జిల్లా కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల హెడ్ మాస్టర్‌ను బురిడీ కొట్టించారు సైబర్ నేరస్తులు. తాము సీఐడీ అధికారులమని ప్రధానోపాధ్యాయుడికి ఫోన్ చేసిన కేటుగాళ్లు.. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ పేరు ఉందంటూ ఆయనపై బెదిరింపులకు దిగారు. డిజిటల్ అరెస్టు చేయబోతున్నట్లు భయబ్రాంతులకు గురి చేశారు. అయోమయంలోకి నెట్టేసి ఆపై డబ్బులు డిమాండ్ చేశారు.
గుంటూరు: సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. విద్యావంతులే లక్ష్యంగా లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు గ్రామీణ పేదలు, నిరక్ష్యరాసులకు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడేవారు. బ్యాంకు అధికారులమని చెప్తూ అకౌంట్లలో సొత్తు కాజేసేవారు. అయితే, ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్టులు పెరిగిపోయాయి. పెద్దపెద్ద చదువులు చదివిన వారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటి రాజకీయ నేతలూ, బిజినెస్ మ్యాన్లు ఈ డిజిటల్ అరెస్టుల బారిన పడుతున్నారు. ఏకంగా లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. నిందితులను పట్టుకోవడమూ కష్టం కావడంతో ఇటీవల ఈ తరహా నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే, డిజిటల్ నేరస్తులకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్న పోలీసులు.. వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల హెడ్ మాస్టర్‌ను బురిడీ కొట్టించారు సైబర్ నేరస్తులు. తాము సీఐడీ అధికారులమని ప్రధానోపాధ్యాయుడికి ఫోన్ చేసిన కేటుగాళ్లు.. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ పేరు ఉందంటూ ఆయనపై బెదిరింపులకు దిగారు. డిజిటల్ అరెస్టు చేయబోతున్నట్లు భయబ్రాంతులకు గురి చేశారు. అయోమయంలోకి నెట్టేసి ఆపై డబ్బులు డిమాండ్ చేశారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.42లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెడ్ మాస్టర్ నుంచి చివరికి రూ.22లక్షలు దండుకున్నారు. ఈ మేరకు నగదును విశాఖపట్నానికి చెందిన ఇంద్రవస్థ హాస్పిటల్ డైరెక్టర్ అకౌంట్‌కి ట్రాన్స్ ఫర్ చేశారు ఉపాధ్యాయుడు. అయితే, తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే కాకుమాను పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాల్ డేటా, నగదు ట్రాన్స్ ఫర్ అయిన వివరాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. విచారణలో ఇంద్రవస్థ హాస్పిటల్ డైరెక్టర్ సురేశ్ నాయుడి ఖాతాకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. అతన్ని విచారించగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కమిషన్ కోసం కరెంట్ అకౌంట్ ఖాతాను నిందితులకు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మెుత్తం నలుగురిని కాకుమాను పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కేటుగాళ్ల నుంచి 3 స్మార్ట్ ఫోన్లు, రూ.50వేలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నేరానికి పాల్పడిన ఇంద్రవస్థ హాస్పిటల్ అకౌంట్ కిట్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అలాంటి కాల్స్ చేసి ఎవరైనా బెదిరింపులకు దిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోవద్దని హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP minister Kollu Ravindra: జగన్ బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి: మంత్రి కొల్లు రవీంద్ర
AP SECA Awards 2025: తిరుపతికి గోల్డ్, భీమవరానికి సిల్వర్ అవార్డులు.. ఎందుకంటే..