Nara Lokesh: ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదు: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:07 PM
టీడీపీని భూస్థాపితం చేస్తామని కొందరు అన్నారని.. కానీ అన్న ఎన్టీఆర్ స్థాపించిన ఆ పార్టీ మరో వందేళ్లు ఉంటుందని మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
రాజమండ్రి, డిసెంబర్ 19: చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలి పెట్టమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు తెలుసునన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీని భూస్థాపితం చేస్తామని కొందరు అన్నారని.. కానీ అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరో వందేళ్లు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీలో ఒక జబ్బు ఉందన్నారు. అదే అలక అని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేపై అలగడం కంటే ఆయనపై పోరాడాలంటూ కార్యకర్తలకు మంత్రి లోకేశ్ సూచించారు. నాలుగు గోడల మధ్య ఆయన చేస్తున్న తప్పులను చెప్పి సరి చేయాలంటూ వారిని కోరారు. మంగళగిరి, రాజమండ్రి నియోజకవర్గాలు.. టీడీపీకి అడ్డాలని వివరించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదని స్పష్టం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావును వైసీపీ ప్రభుత్వంలో జైల్లో పెట్టి వేధించారని తెలిపారు. ఇక గతంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సైతం అసెంబ్లీ సాక్షిగా ట్రోల్ చేశారన్నారు. తన తల్లిని కూడా అవమానించారన్నారు. ఇవన్నీ తనకు గుర్తు ఉన్నాయని చెప్పారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా 53 రోజులు జైలులో పెట్టారన్నారు. ఆ సమయంలో రాజమండ్రిలోని టీడీపీ కార్యకర్తలు.. తమ కుటుంబానికి అండగా నిలిచారని పేర్కొన్నారు.
టీడీపీ కార్యకర్తల త్యాగాల వల్లే 164 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీలో కీలకంగా వ్యవహరించిన కార్యకర్తలను మంత్రి లోకేష్ సత్కరించారు. అలాగే కార్యకర్తల నుంచి వినతి పత్రాలు సైతం ఆయన స్వీకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ. 500 నకిలీ నోట్ల కలకలం.. రైతును అదుపులోకి తీసుకున్న పోలీసులు
నియామకాల్లో పారదర్శకత ముఖ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము