Share News

President Draupadi Murmu: నియామకాల్లో పారదర్శకత ముఖ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:10 PM

హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రారంభించారు. ఈ సదస్సు శనివారం ముగియనుంది. దీనికి భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.

President Draupadi Murmu: నియామకాల్లో పారదర్శకత ముఖ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Draupadi Murmu

హైదరాబాద్, డిసెంబర్ 19: నియామకాల్లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత పెంచడంపై దృష్టి సారించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషన్ చైర్మన్లకు స్పష్టం చేశారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


2047 వికసిత భారత్ లక్ష్య సాధనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అలాగే నియామకాల్లో పారదర్శకత, నైతికత అవసరమని స్పష్టం చేశారు. నైపుణ్యాలు నేర్పవచ్చని కానీ సమగ్రత లోపాన్ని మాత్రం భర్తీ చేయలేమన్నారు. టెక్నాలజీ సవాళ్లను ఎదుర్కొనేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కమిషన్ చైర్మన్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.


రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు.. ఈ సదస్సుకు హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన పద్ధతులు, పరస్పర సహకారంపై ఈ సదస్సులో చర్చించనున్నారు.


ఈ సదస్సుకు హాజరైన రాష్ట్రపతి ముర్ముకు రామోజీ ఫిలిం సిటీలో ఘన స్వాగతం పలికారు. ఆమె వెంట తెలంగాణకు చెందిన పలువురు మంత్రులతోపాటు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, యూపీఎస్సీ చైర్మన్ అజయ్‌కుమార్, యూపీఎస్సీ కార్యదర్శి శశి రంజన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సు శనివారం (20-12-2025)తో ముగియనుంది. ఈ సదస్సుకు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర మంత్రితో భేటీ.. ‘దుగరాజపట్నం’కు సహకరించండి: సీఎం

తెలంగాణకు ఇచ్చినట్టే మాకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి నిమ్మల

For More Telangana News And Telugu News

Updated Date - Dec 19 , 2025 | 05:46 PM