Nimmala Ramanaidu: తెలంగాణకు ఇచ్చినట్టే మాకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:54 PM
తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం , సీతారామ ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారో తమకు అలాగే అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులే ఏపీకి కూడా వర్తించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో (Union Minister CR Patil) సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక భేటీ జరిగిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంచి చర్చ జరిగిందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర సహకారానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారన్నారు. 2011లో జారీ చేసిన పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామని. స్టాప్ వర్క్ ఆర్డర్ ప్రస్తుతం 2026 నవంబర్ వరకు పొడిగించారని చెప్పారు. పోలవరం రైట్, లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంపు, అదనపు వ్యయాన్ని పోలవరం ప్రాజెక్టు ఖర్చులో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు.
గోదావరి జలాల పంపకాలపై వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామన్నారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని సీఎం కోరారన్నారు. వంశధార ట్రిబ్యునల్ 2021 తీర్పును వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. వంశధార తీర్పుతో నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి అవకాశం ఉంటుందన్నారు. పోలవరం – నల్లమల సాగర్‌కు తక్షణ సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కోరామని తెలిపారు. గోదావరిలో వృధాగా సముద్రంలో కలిసిపోతున్న వరద జలాల వినియోగమే లక్ష్యమని స్పష్టం చేశారు. గత 50 ఏళ్లలో 1.53 లక్షల టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్టు వెల్లడించారు. గత 5 ఏళ్లలోనే 20,300 టీఎంసీల నీరు వృథా అయ్యిందని.. ఏటా సగటున 4,000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలుస్తోందని చెప్పారు.
దిగువ రాష్ట్రంగా వరద నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం , సీతారామ ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారో తమకు అలాగే అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులే ఏపీకి కూడా వర్తించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఉన్న రాజకీయ విభేదాల కారణంగానే తెలంగాణ ప్రభుత్వం కేసులు వేస్తుంది తప్ప వేరే అంశం అంటూ ఏమీ లేదన్నారు. సుప్రీంకోర్టులో తాము కూడా కెవిఎట్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. వృథా నీటిని వినియోగించడం జాతీయ ప్రయోజనమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు రెండూ బాగుండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు
Read Latest AP News And Telugu News