CM Chandrababu: కేంద్ర మంత్రితో భేటీ.. ‘దుగరాజపట్నం’కు సహకరించండి: సీఎం
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:06 PM
ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద రూ.590.91 కోట్లు కేంద్రం నుంచి సహాయంగా అందాల్సి ఉందని సీఎం వివరించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లోని దుగరాజుపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమాశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు అంగీకారం తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో - ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) సిద్ధమైందన్నారు. నౌక నిర్మాణానికి అనుబంధంగా ఎమ్ఎస్ఎమ్‌ఈ (MSME) యూనిట్లు, కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సమగ్ర క్లస్టర్‌గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్‌గా త్వరితగతిన ఆమోదించాలని సీఎం చంద్రబాబు కోరారు.
అలాగే ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం సాయం చేయాలన్నారు. ఫేజ్ -1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని సీఎం కోరారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.
ఫేజ్-1లో జువ్వల దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను రూ.1361.49 కోట్లతో చేపట్టామని సోదాహరణగా వివరించారు. జువ్వల దిన్నె హార్బర్‌కు మాత్రమే కేంద్రం నుంచి రూ.138.29 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.782.29 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అయితే మిగిలిన మూడు హార్బర్లకు కేంద్ర నుంచి సాయం ఇంకా అందలేదని చెప్పారు. ఫేజ్ -1 పూర్తి కోసం ఇంకా రూ.440.91 కోట్లు అవసరం ఉందని కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకు వెళ్లారు.
ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద రూ.590.91 కోట్లు కేంద్రం నుంచి సహాయంగా అందాల్సి ఉందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు అన్నీ ఎదురుదెబ్బలే.. వాళ్లకు దొరికింది అదొక్కటే: ఎంపీలతో సీఎం
తెలంగాణకు ఇచ్చినట్టే మాకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి నిమ్మల
For More AP News And Telugu News