Fake Rs 500 Notes: రూ. 500 నకిలీ నోట్ల కలకలం.. పరారీలో రైతు
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:31 PM
తీసుకున్న లోన్ నగదును బ్యాంకులో ఆ రైతు చెల్లించాడు. అది నకిలీ నగదుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ఈ నగదు నీకు ఎక్కడి నుంచి వచ్చిదంటూ రైతును బ్యాంకు సిబ్బంది ప్రశ్నించారు. దాంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
నిజామాబాద్, డిసెంబర్ 19: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో దొంగ నోట్ల కలకలం రేగింది. స్థానిక కెనరా బ్యాంక్‌లో పంట రుణం చెల్లించేందుకు రైతు తీసుకువచ్చిన నగదును దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు. రైతు తీసుకు వెళ్లిన రూ. 2,08,500 నగదు మొత్తం బ్యాంక్ అధికారులు నకిలీవిగా తేల్చారు. మొత్తం రూ. 500 నోట్లుగా గుర్తించారు. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన నరెడ్ల చిన్న సాయిలు గతంలో కెనరా బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఈ నగదు చెల్లించేందుకు గురువారం మధ్యాహ్నం కెనరా బ్యాంకులు వెళ్లాడు. కౌంటర్‌లో ఆ నగదును చెల్లించాడు. అనంతరం ఈ నగదును బ్యాంకు సిబ్బంది లెక్కిస్తుండగా.. అవి నకిలీ నోట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని బ్యాంక్ ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఈ నగదు ఎక్కడి నుంచి తీసుకు వచ్చావంటూ రైతు నరెడ్ల చిన్న సాయిలును బ్యాంకు అధికారులు, సిబ్బంది నిలదీశారు. దాంతో రైతు అక్కడి నుంచి పరారైయ్యాడు. దీనిపై పోలీసులకు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. రైతు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇటీవల వర్ని మండలంలోఈ రైతు తన ధాన్యాన్ని మిల్లర్లకు బ్రోకర్ ద్వారా విక్రయించాడు.
అతడికి వారు నగదు చెల్లించినట్లు సమాచారం అందుతుంది. చిన్న సాయిలు.. తన సోదరి ఇచ్చిన నగదు మొత్తం బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నగదు ఒక్కడే ఇచ్చాడా? లేకుంటే వేర్వేరు ప్రాంతాల నుంచి తెచ్చాడా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర మంత్రితో భేటీ.. ‘దుగరాజపట్నం’కు సహకరించండి: సీఎం
నియామకాల్లో పారదర్శకత ముఖ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
For More Telangana News And Telugu News