Devineni Uma: ఆ అవార్డుతో జగన్ కడుపు మంట మరింత పెరిగింది: దేవినేని
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:58 PM
మాజీ సీఎం జగన్‌పై దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి రూ.481 కోట్లు ఖర్చు చేసిన జగన్.. పాడేరు, పార్వతిపురం కాలేజీలకు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.
అమరావతి, డిసెంబర్ 19: శాసనసభకు వెళ్లి ప్రశ్నించలేని జగన్... ఇవాళ లోక్ భవన్ ముందు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా (Former Minister Devineni Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేసే నాటకాలు ఏంటో.. గల్లీలో జగన్ అబద్ధాలు ఏంటో అర్థం కావడం లేదన్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలోనే నిర్మిస్తే బాగుంటుందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొందని తెలిపారు. వైసీపీ ఎంపీ గురుముర్తి పీపీపీ విధానానికి అనుకూలంగా సంతకం చేశారని.. వైవీ సుబ్బారెడ్డి, మిగతా వైసీపీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వమే మొట్టి కాయలు పెట్టిందని అన్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘం, నీతి ఆయోగ్ , న్యాయస్థానాలు సైతం పీపీపీ విధానం మేలని చెబుతున్నాయని తెలిపారు. పీపీపీ విధానంలో వైద్య కాలేజీలను పూర్తి చేసి వేల మంది పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.
ఆరోగ్య శ్రీ, 108,104 వ్యవస్థలు పీపీపీ విధానం ద్వారా నడపలేదా జగన్ అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆరోశ్రీ ద్వారా రూ. 6000 కోట్లు ఖర్చు చేశామని.. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.1000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రుషికొండను బోడి గుండు చేసి రూ.463 కోట్లు ఖర్చు చేశారని.. నిన్న ప్రెస్ మీట్‌లో రూ.230 కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ అంటున్నారని మండిపడ్డారు. కేంద్ర క్యాబినెట్‌లో యోగాంధ్ర గురించి ప్రధాని మోదీ మెచ్చుకున్నారని.. ఈవెంట్ ఖర్చు రూ.60 కోట్లు.. దానిపై కూడా జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి రూ.481 కోట్లు ఖర్చు చేసిన జగన్.. పాడేరు, పార్వతిపురం కాలేజీలకు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంగళగిరి ఎయిమ్స్‌కు 31 లక్షల ఓపీలు వచ్చాయని... వేల కొలది ఆపరేషన్లు జరిగాయన్నారు. జగన్ ఐదేళ్ల కాలంలో కేవలం 20 లక్షల ఓపీలు మాత్రమే వచ్చాయని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఎకనామిక్ టైమ్స్ వారు ఇచ్చిన అవార్డుతో జగన్ మోహన్ రెడ్డికి కడుపు మంట మరింత పెరిగిందని... అందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయంలో వైద్య రంగంలో 4వ స్థానంలో ఉన్న ఏపీ రాష్ట్రాన్ని జగన్ 10వ స్థానానికి తీసుకెళ్లారని విమర్శించారు. పరకామణి కేసు చిన్నది అనడంతో దేవాలయాలు, హిందువులపై జగన్ అభిప్రాయం ఏంటో అర్థమవుతోందన్నారు. చెడ్డీల కంపెనీ పక్క రాష్ట్రాలకు తరిమేసిన జగన్ గూగుల్ తీసుకొచ్చాడనటం హాస్యాస్పదమని మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
జగన్‌కు అన్నీ ఎదురుదెబ్బలే.. వాళ్లకు దొరికింది అదొక్కటే: ఎంపీలతో సీఎం
Read Latest AP News And Telugu News