CM Chandrababu: గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Feb 11 , 2025 | 01:15 PM
CM Chandrababu: గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు.
అమరావతి: గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని గుర్తుచేశారు.
అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తీసుకురావడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యిందని.. దాని పునరుద్ధరణకు తాము కృషి చేస్తామని వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నానని అన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..
4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News