Minister Gottipati Ravi Kumar: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్‌లు..
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:55 AM
PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆ పథకం ద్వారా 3550 KW ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లకు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5006.35 మెగావాట్లుగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్రం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని 78.50 గిగావాట్లుకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. మోడల్ స్కూల్, కేజీబీవీ వసతి గృహాల్లో 2138 KW సామర్థ్యంతో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడారు..
గ్రామస్థాయిలో సోలార్ రూఫ్‌టాప్‌లు..
PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆ పథకం ద్వారా 3550 KW ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లకు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్‌కు బ్యాంకర్లు మద్దతు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని వివరించారు. సూర్యఘర్‌కు సహకరించాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్ల సమావేశంలో కోరారని గుర్తు చేశారు. ప్రభుత్వ భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసినట్లు చెప్పారు. త్వరలోనే గ్రామస్థాయిలో పంచాయతీ భవనాలపై సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అర్హులైన వారికి ఉచితంగా సోలార్..
ఏపీలోని అన్ని ప్రభుత్వం భవనాలపై 130 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని గొట్టిపాటి వ్యాఖ్యనించారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో 9 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని రాష్ట్రం సాధించిందని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ వ్యవస్థను సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి తరిమేశారని మండిపడ్డారు. గత వైసీపీ విద్యుత్ ఉత్పత్తిని పెంచకుండా, 9 సార్లు చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..