Kondapalli Srinivas: తల్లికి వందనంపై వైసీపీవి అసత్య ఆరోపణలు
ABN , Publish Date - Jun 15 , 2025 | 01:38 PM
అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శమని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. చదువు ఒకటే భవిష్యత్‌ను మారుస్తోందని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మెరుగైన విద్యాభోదన అందిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్: తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు (YSRCP Leaders) అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్(AP Minister Kondapalli Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి రూ. 15వేలు అందిస్తున్నామని తెలిపారు. ఏపీవ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని 65లక్షల మందికి అందజేశామని చెప్పారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. అనంతరం మీడియాతో మంత్రి కొండపల్లి మాట్లాడారు. తల్లికి వందనం పథకాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
చదువు ఒకటే భవిష్యత్‌ను మారుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శమని ఉద్ఘాటించారు. విద్యార్థులకు సిలబస్‌లో అనేక మార్పులు చేస్తున్నామని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మెరుగైన విద్యాభోదన అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌కు తమ ప్రభుత్వం మంచి బాటలు వేస్తోందని చెప్పుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు కానీ...ఒకరికే ఇచ్చారని అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు దారుణంగా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లితండ్రులు తమ పిల్లలను మంచిగా చదివించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు సైతం మంచి విద్య అవసరమని అన్నారు. తల్లికి వందనం పథకం అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం కేవలం సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టిందని.. అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
ఇవి కూడా చదవండి:
విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు
19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో
For More AP News and Telugu News