Share News

AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం

ABN , Publish Date - May 13 , 2025 | 08:55 AM

AP Police Society scam: తిరుపతి జిల్లాలోని పోలీసు సహకార సొసైటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రుణ గ్రహీతల నుంచి వసూలు చేసిన నగదు స్వాహా అయ్యాయి. డబ్బులు స్వాహా కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఈ కేసులో విచారణ చేపట్టారు.

AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం
AP Police Society scam

తిరుపతి: జిల్లాలోని పోలీసు సహకార సొసైటీలో (Police Cooperative Society) భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయి. సొసైటీ నుంచి కొంతమంది పోలీసు సిబ్బంది రుణాలు తీసుకున్నారు. వీటిని సకాలంలో వారు చెల్లించారు. అయితే వారు చెల్లించిన నగదు మాత్రం పోలీసు సహకార సొసైటీలో జమ కాలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డబ్బులు జమకాకపోవడంతో పోలీసు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.


రుణగ్రహీతలు షాక్..

కాగా.. రుణ గ్రహీతల నుంచి వసూలు చేసిన రూ.80 లక్షలు స్వాహా అయ్యాయి. రుణాలను సకాలంలో చెల్లించినా.. వారికి డబ్బులు తిరిగి చెల్లించలేదని నోటీసులు వచ్చాయి. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నోటీసులు రావడం చూసి రుణగ్రహీతలు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. ఈ విషయంపై వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత రెండేళ్లుగా పోలీసు సహకార సొసైటీ లావాదేవీలపై ఎలాంటి ఆడిట్ జరగక పోవడమే ఈ కుంభకోణానికి కారణంగా తెలుస్తోంది. ఏకంగా రూ. 80 లక్షల వరకు నగదు మాయం అవడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.


ఆధారాలు దొరకకుండా...

ఆధారాలు దొరకకుండా డేటాను మార్చే ప్రయత్నాలు కూడా జరిగి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆడిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు అందరి వివరాలు సేకరించి ఎవరి ఖాతా నుంచి ఎంతమేరకు నగదు మాయమైందో కనిపెట్టాలని ఆదేశించారు. ఆర్థిక నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలినట్లయితే దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. తమ జీతాల నుంచే ఈ రుణాలను తీసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


న్యాయం చేయాలి.. బాధితుల డిమాండ్

మళ్లీ బాకీ ఉన్నట్లుగా చెబితే తాము ఎక్కడి నుంచి తెచ్చి నగదు కట్టాలని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమ కష్టార్జితాన్ని దోచుకున్న వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. నిధులు మాయమైన విషయం బయటకు రావడంతో సహకార సొసైటీల పనితీరుపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆడిట్ లేకుండా నిధులను నిర్వహించడం, సిబ్బంది ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వంటి అంశాలు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రతి ఏడాది జరగాల్సిన ఆడిట్ ఎందుకు చేపట్టడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆడిట్ జరగకపోవడంతోనే నిధులు స్వాహా చేశారని బాధితులు అంటున్నారు. మరోసారి నిధులు దుర్వినియోగం అవకుండా రెగ్యూలర్‌గా ఆడిట్ నిర్వహించాలని బాధితులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు

Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..

Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి

Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు

For More AP News and Telugu News

Updated Date - May 13 , 2025 | 09:05 AM