Share News

Tirumala Brahmotsavam 2025: జాతీయ స్థాయిలో ఔట్‌లుక్ తీసుకొచ్చేలా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఈవో

ABN , Publish Date - Sep 19 , 2025 | 02:52 PM

బ్రహ్మోత్సవాలలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు, గదులు రద్దు చేశామని.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో వివరించారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులకు 1.16 లక్షల రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను భక్తులకు విక్రయించామని తెలిపారు.

Tirumala Brahmotsavam 2025: జాతీయ స్థాయిలో ఔట్‌లుక్ తీసుకొచ్చేలా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఈవో
Tirumala Brahmotsavam 2025

తిరుమల, సెప్టెంబర్ 19: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగంతో పాటు టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయం కోసం చివరి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించామని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు మంచి సౌకర్యాలు అందించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఈనెల 28న సాయంత్రం 6:30 గంటలకు శ్రీవారి గరుడసేవ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ధ్వజారోహణం రోజున సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో పేర్కొన్నారు.


రూ 5.5 కోట్లతో విద్యుత్ దీపాలంకరణలు, ఇంజనీరింగ్ పనులు చేశామని, దాతలు సహకారంతో రూ 3.5 కోట్లతో పుష్పాలంకరణలు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య పనుల కోసం అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు, గదులు రద్దు చేశామని.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులకు 1.16 లక్షల రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను భక్తులకు విక్రయించామని తెలిపారు. 8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ పెట్టామన్నారు. 36 ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశామన్నారు. 20 హెల్ప్ డెక్స్‌లు, ఐదు భాషల్లో భక్తులకు సమాచార వ్యవస్థను కల్పించామని చెప్పారు.


గరుడ సేవ రోజున మాడవీధుల్లో రెండు లక్షల మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక టీమ్‌గా ఉదయం నుంచి భక్తులకు అన్నప్రసాదాలు, బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం భక్తులకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. తిరుమలలో నాలుగు వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉందన్నారు. తిరుపతిలో ఐదు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని.. పార్కింగ్ ప్రదేశాలలో ఆర్టీసీ బస్సులు ఉంటాయన్నారు.


28 రాష్ట్రాల నుంచి‌ 290 కళాబృందాలతో బ్రహ్మోత్సవాల్లో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు జాతీయ స్థాయిలో ఔట్‌లుక్ తీసుకొచ్చే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాల కళాబృందాలకు అవకాశం కల్పించామన్నారు. గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది భక్తులు గరుడ వాహన సేవను దర్శించుకుంటారన్నారు. తిరుమల నంబి, వసంత మండపం, మేదరమెట్ట, వరాహస్వామి కార్నర్‌లలో... ప్రతి కార్నర్‌లో గరుడ వాహనాన్ని 45 నిమిషాలు నిలబెడతామన్నారు. గ్యాలరీల్లోకి చేరుకోలేక బయట ప్రాంతాల్లో వేచి ఉన్న భక్తుల్లో సుమారు 40 వేల మందికి మాడవీధి మూలల్లో వాహనదర్శనం కల్పిస్తామన్నారు.


ఫేక్ వార్తలు, ప్రచారాలు చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా సోషల్ మీడియా వినియోగం పెంచామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీటీ, విజిలెన్స్, పోలీస్ సంయుక్తంగా స్పెషల్ సోషల్ మీడియా టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫేక్ న్యూస్‌లపై సోషల్ మీడియా టీమ్ స్పెషల్ ఫోకస్ పెడుతుందన్నారు. భక్తుల మనోభావాల దెబ్బతీసేలా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరంగా తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరికలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో

ఓబుళాపురం మైనింగ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 02:52 PM