Revenue Files Fire Case: ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో
ABN , Publish Date - Sep 19 , 2025 | 02:11 PM
మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రెవెన్యూ ఫైళ్ల దహనంపై దాదాపు ఆరు గంటల పాటు మురళిని సీఐడీ అధికారులు విచారించారు.
తిరుపతి, సెప్టెంబర్ 19: మదనపల్లె పూర్వ ఆర్డీవో మురళిని తిరుపతి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దహనం కేసులో మురళికి సుప్రీం కోర్టు నిన్న (గురువారం) బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (శుక్రవారం) మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రెవెన్యూ ఫైళ్ల దహనంపై దాదాపు ఆరు గంటల పాటు మురళిని సీఐడీ అధికారులు విచారించారు. అనంతరం అతడిని చిత్తూరు కోర్టుకు తరలించారు.
ఈకేసులో ఏ2గా ఉన్న మురళి.. మదనపల్లె ఆర్డీవోగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల ఫ్రీహోల్డ్‌లో అనేక అక్రమాలు చేసినట్లు సీఐడీ తేల్చింది. మొత్తం 48,360 ఎకరాల్లో, సుమారు 22,523 ఎకరాలు విధి విధానాలకు విరుద్ధంగా అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు గుర్తించింది. ప్రభుత్వ మార్పు తరువాత, ఈ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఏ1 గౌతమ్ తేజ్, ఏ3 వి. మాధవరెడ్డి, ఏ4 తుకారాంలతో కలిసి కార్యాలయానికి నిప్పు పెట్టించినట్లు విచారణలో సీఐడీ అధికారులు తేల్చారు.
కాగా.. గతేడాది ఫైళ్ళ దహనం కేసులో ఏ2 నిందితుడుగా మురళిపై కేసు నమోదు అయ్యింది. ముందస్తు బెయిల్ కోసం మురళి హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీం కోర్టు వెళ్లి మధ్యంతర బెయిల్ పొందారు మురళి. అయితే గత జులై 8న తిరుపతిలో మురళిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ.. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఉందని వెంటనే విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా మురళి ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయడంతో.. వెంటనే అతడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఓబుళాపురం మైనింగ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
వైసీపీ ‘చలో మెడికల్ కాలేజ్’.. టెన్షన్ టెన్షన్
Read Latest AP News And Telugu News