Share News

NREGS Scam: ఉపాధి పథకంలో మృతుల పేర్లతో బిల్లులు.. సోషల్ ఆడిట్‌లో నిజాలు బయటకు

ABN , Publish Date - Aug 14 , 2025 | 09:59 AM

చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలు వచ్చి గుర్రంకొండ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనులు చేశాయి. ఈ ఆత్మలు కూడా వారం రోజుల పాటు ఉపాధి పథకంలో వంక పనులు, చెరువులో పూడికతీత పనులు, పండ్ల తోటల పనులు చేయడం విశేషం. గ్రామాల్లో పాడి రైతుల కోసం నిర్మించిన గోకులాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీ బృందం బహిరంగ సభలో వెల్లడించింది.

NREGS Scam: ఉపాధి పథకంలో మృతుల పేర్లతో బిల్లులు.. సోషల్ ఆడిట్‌లో నిజాలు బయటకు
NREGS Scam

» చనిపోయిన వ్యక్తుల పేరిట బిల్లులు

» టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్

» గోకులం బిల్లుకు రూ.10 వేలు లంచం

» దొంగ మస్టర్లతో బిల్లులు స్వాహా

» సామాజిక తనిఖీలో వెలుగులోకి...

గుర్రంకొండ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలు వచ్చి గుర్రంకొండ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనులు (NREGS Scam) చేశాయి. ఈ ఆత్మలు కూడా వారం రోజుల పాటు ఉపాధి పథకంలో వంక పనులు, చెరువులో పూడికతీత పనులు, పండ్ల తోటల పనులు చేయడం విశేషం. గ్రామాల్లో పాడి రైతుల కోసం నిర్మించిన గోకులాల్లో (Gokulam Shed Construction) అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీ బృందం బహిరంగ సభలో వెల్లడించింది. అంతేకాకుండా గోకులం షెడ్‌కు బిల్లు మంజూరు చేయాలంటే రూ.10 వేలు లంచం ఇచ్చినట్లు టీడీపీ సీనియర్ నేత జిల్లా అధికారులకు సమావేశంలో ఫిర్యాదు చేయడం ఉపాధి సిబ్బంది అవినీతి, అక్రమాలకు నిదర్శనంగా మారింది. అలాగే ఉపాధి పనుల్లో కూలీలు పనులు చేయకనే బినామీ పేర్లతో బిల్లులను డ్రా చేసినట్లు తనిఖీ బృందం గుర్తించింది. అంతేకాకుండా దొంగ మస్టర్లతో పలు గ్రామాల్లో బిల్లులు స్వాహా చేసినట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది.


గుర్రంకొండ మండలంలోని ఉపాధి హామీ పథకంలో వివిధ రకాల పనులు చేశారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.5.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో రైతుల పొలాల్లో పండ్ల తోటల పెంపకం, పూడికతీత పనులు, చెరువుల్లో పూడికతీత పనులు, వంక పనులు, ట్రెంచ్ పనులు, సీసీ రోడ్లు, గోకులం షెడ్లను నిర్మించారు. ఈ పనులను సామాజిక తనిఖీ బృందం పది రోజుల పాటు గ్రామంలో తిరిగి ప్రతి పనిని తనిఖీ చేసి అవినీతి, అక్రమలను బుధవారం డ్వామా పీడీ వెంకటరత్నం ఆధ్వర్యంలో జరిగిన సామాజిక తనిఖీ బహిరంగ సభలో వెల్లడించారు. ఇందులో భాగంగా మండలంలోని సరిమడుగు పంచాయతీలో ఉపాధి హామీ పనులను రెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తులు చేసినట్లు చూపి బిల్లులను డ్రా చేశారు. గ్రామానికి చెందిన చిన్నరమణ 2023వ సంవత్సరం, రెడ్డెమ్మ 2021లో చనిపోయారు. వీరిద్దరూ ఉపా ధి హామీ పథకంలో 2024వ సంవత్సరంలో పనులు చేసినట్లు చూపి బిల్లులను డ్రా చేసినట్లు తనిఖీ బృందం వెల్లడించింది.


అలాగే శెట్టి వారిపల్లె పంచాయితీలో నిర్మించిన రెండు గోకులాలు బినామీ పేర్లతో నిర్మించినట్లు సామాజిక తనిఖీ బృందం వెల్లడించడంతో బినామీలకు, రైతులకు వాగ్వాదం జరిగింది. దీంతో రెండు గోకులాల నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఏపీడీ మధుబాబును పీడీ ఆదేశించారు. అలాగే టి.రాచపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ సింగిల్ విండ్ చైర్మన్ మహాత్మారెడ్డి తన భార్య పేరిట గోకులం షెడ్ మంజూరైతే బిల్లు చేయడానికి టీఏ మదన్ మోహన్ రాజుకు రూ.10 వేలు లంచం ఇచ్చినట్లు పీడీకి ఫిర్యాదు చేశాడు. అలాగే మర్రిపాడు, రామాపురం, ఎల్లుట్ల, సరిమడుగు. చెర్లోపల్లె, టి.పసలవాండ్లపల్లె గ్రామాల్లో దొంగమస్టర్లను వేసి బిల్లులు డ్రా చేసినట్లు తనిఖీ బృందం తెలిపింది. అలాగే గుర్రంకొండ పంచాయతీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పనులు చేసినట్లు చూపి నిధులు స్వాహా చేసినట్లు గుర్తించారు. గుర్రంకొండ, టి.పసలవాండ్లపల్లెలో హౌసింగ్ బిల్లులను లబ్ధిదారుల పేరిట కాకుండా బినామీ వ్యక్తుల ఖాతాలోకి జమ చేసినట్లు తెలిపారు. అలాగే వివిధ గ్రామాల్లో జరిగిన చెరువులకు నీరు చేరే వంక పనులో పని పరిమాణం తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ పనులకు సంబంధించి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే పలు గ్రామాల్లో ఏపీవో జయరామిరెడ్డి మస్టర్లను తనిఖీ చేయకపోవడంతో అవినీతి, అక్రమాలు జరిగినట్లు తనిఖీ బృందం తెలిపింది.


ఇద్దరు ఉపాధి సిబ్బంది సస్పెన్షన్

గుర్రంకొండ మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు డ్వామా పీడీ వెంకటరత్నం తెలిపారు. సరిమడుగు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పూజిత, టెక్నికల్ అసిస్టెంట్ మదన్ మోహన్ రాజులను సస్పెండ్ చేసినట్లు పీడీ తెలిపారు. అలాగే వివిధ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాల నుంచి రూ.7 వేలు రికవరీ చేయగా 8 వర్క్ ఐడీలో జరిగిన పనులపై విచారణ చేయాలని ఏపీడీ మధుబాబును ఆదేశించారు. మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో రూ.2,39,372 లక్షలు అవినీతి జరిగినట్లు పీడీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది

జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 10:02 AM