Share News

NH 44 Expansion: ఏపీలో రోడ్డు ప్రమాదాలకు చెక్‌.. సిక్స్‌లేన్‌తో ఊరట

ABN , Publish Date - Dec 15 , 2025 | 08:46 AM

అనంతపురం జిల్లా కేంద్రంలోని తపోవనం సర్కిల్‌లో వై జంక్షన్‌ రాబోతోంది. ప్రస్తుతం 44వ జాతీయ రహదారి.. కర్నూలు నుంచి అనంతపురం మీదుగా కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్టు వరకు 261 కిలోమీటర్ల పొడవునా ఫోర్‌లేన్‌గా ఉంది.

NH 44 Expansion: ఏపీలో రోడ్డు ప్రమాదాలకు చెక్‌.. సిక్స్‌లేన్‌తో ఊరట
NH 44 Expansion

  • రయ్‌.. రయ్‌..!

  • ఎన్‌హెచ్‌ 44 విస్తరణకు చర్యలు

  • 4 లేన్‌ల నుంచి 6 లేన్‌లకు మార్పు

  • నాలుగు ఫ్లైవోవర్లు.. 20 అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు

  • డీపీఆర్‌ సిద్ధం.. పనుల ప్రారంభమే తరువాయి..

  • తగ్గనున్న ప్రయాణ సమయం

అనంతపురం న్యూటౌన్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా (Anantapur District) కేంద్రంలోని తపోవనం సర్కిల్‌లో వై జంక్షన్‌ రాబోతోంది. ప్రస్తుతం 44వ జాతీయ రహదారి.. కర్నూలు నుంచి అనంతపురం మీదుగా కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్టు వరకు 261 కిలోమీటర్ల పొడవునా ఫోర్‌లేన్‌గా ఉంది. ఆ స్థానంలో సిక్స్‌లేన్‌గా విస్తరణ పనులు చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మాణ సమయంలోనే సిక్స్‌లేన్‌కు అనుగుణంగా స్థలసేకరణ దాదాపు పూర్తి చేశారు. దీంతో ప్రస్తుతం స్థల సేకరణ సమస్య తలేత్తే అవకాశం లేదు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది.


అందుకు అనుగుణంగా ఇప్పటికే ఎక్కడ ఎక్కడ ఏమి చేయాలన్నది డీపీఆర్‌ (డీటేల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) కూడా సిద్ధం చేశారు. కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్టు వరకు నాలుగు అతి పెద్ద ఫ్లైవోవర్స్‌తోపాటు మరో 20 అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేసేలా డీపీఆర్‌ సిద్ధం చేశారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని తపోవనం సర్కిల్‌లో ఫ్లైవోవర్‌ నిర్మించడం ద్వారా అక్కడ వై జంక్షన్‌ ఏర్పాటు కానున్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. అదే తరహాలో రాప్తాడు వద్ద మరో వై జంక్షన్‌ ఫ్లైవోవర్‌ బ్రిడ్జి, సోమందేపల్లి, చిలమత్తూరు ప్రాంతంతో కలిపి మొత్తం నాలుగు ఫ్లైవోవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్నారు. 261 కిలో మీటర్ల పొడవుతో 6 లేన్ల రోడ్డుగా విస్తరణ చేయనున్నారు.


రోడ్డు ప్రమాదాలకు చెక్‌

ప్రస్తుతం జాతీయ రహదారిలోని పలుచోట్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తపోవనం, రాప్తాడు సర్కిళ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. సిక్స్‌లేన్‌ రహదారితో పాటు ఫ్లైవోవర్ల నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పడవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాప్తాడు వై జంక్షన్‌కు రూ.65 కోట్లు, సోమందేపల్లి వద్ద ఫ్లైవోవర్‌ బ్రిడ్జికి రూ.75 కోట్లు, చిలమత్తూరు మండలంలో ఫ్లైవోవర్‌కు రూ.65 కోట్లు మంజూరయినట్లు తెలుస్తోంది.


వీటికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఒక్కో బ్రిడ్జి 4.22 కిలో మీటర్ల పొడవుతో ఉంటుంది. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారం కావడతో పాటు రోడ్డు ప్రమాదాలు నియంత్రణ అవుతాయి. మొదట ఫ్లైవోవర్స్‌, అండర్‌ పాస్‌ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది.


మొదట బ్రిడ్జిలు నిర్మిస్తాం

ప్రస్తుతం ఫోర్‌లేన్‌గా ఉన్న జాతీయ రహదారిని సిక్స్‌లేన్‌ విస్తరణకు సంబంధించి కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్‌ సిద్ధం చేశాం. అందుకు అనుగుణంగా ఎక్కడ ఏమి చేయాలన్నది డీపీఆర్‌లో పొందుపరిచారు. మొదట బ్రిడ్జిల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. వాటిని పూర్తి చేస్తే మిగిలిన రోడ్డు విస్తరణ పనులకు పెద్ద సమయం పట్టదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వుల మేరకు కార్యాచరణ చేపడతాం.

-సంజీవరాయుడు, ఎస్‌ఈ, జాతీయ రహదారులశాఖ


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 09:50 AM